ఎస్పీ బాలు అభిమానులకు శుభవార్త.. ఆనందకరమైన విషయాలు చెప్పిన చరణ్
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడింది. గతంలో కంటే ప్రస్తుతం మరింత ఆరోగ్యంగా ఉన్నారు. రోజురోజుకు ఆయన పరిస్థితి మెరుగు పడుతున్నది అని కుమారుడు ఎస్పీ చరణ్ తాజా వీడియోలో వెల్లడించారు. ఎస్పీ చరణ్ విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ..
నాన్న ఆరోగ్యం గురించి 10వ తేదీన అప్‌డేట్ ఇచ్చాను. ఈ రోజు 14వ తేదీ. గత నాలుగు రోజులుగా నాన్నగారి ఆరోగ్యం మరింత మెరుగుపడింది. ఊపిరితిత్తులు, ఇతర అవయవాలు పనితీరు సంతృప్తికరంగా ఉంది. ఎలాంటి కష్టం లేకుండా శరీర కదలించే శక్తి సమకూరింది. ప్రస్తుతం ఫిజియోథెరపీ ప్రారంభించారు. ఫిజియోథెరపీ సందర్భంగా ఆయన చురుకుగా కదులుతున్నారు. డాక్టర్లు ఆయనను పక్కపై నుంచి లేపి కూర్చోపెట్టారు. దాదాపు 15 నిమిషాలపాటు ఆయన కూర్చోగలిగారు అని ఎస్పీ చరణ్ తెలిపారు.

ఇంకా మరో సంతోషకరమైన వార్త ఏమిటంటే.. త్వరలోనే ఘన, ద్రవ పదార్థాలను నోటి ద్వారా ఇవ్వాలని వైద్యులు నిర్ధారించారు. ఒకటి, రెండు రోజుల్లో ఆ ప్రక్రియ మొదలవుతుంది. అన్ని విషయాలు సానుకూలంగా మారాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత నిలకడగా ఉంది అని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.
నాన్నగారి ఆరోగ్యం గురించి మీరు చేసిన పూజలు, ప్రార్థనలకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కష్ట సమయాల్లో మా కుటుంబ పట్ల మీరు చూపించిన ప్రేమ, అనురాగాలకు మా కుటుంబం చాలా హ్యాపీగా ఉంది అని ఎస్పీ చరణ్ వీడియోలో తెలిపారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా వ్యాధి సోకడంతో ఆగస్టు 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు. తనకు కరోనావ్యాధి పాజిటివ్ అని తేలిందని స్వయంగా వీడియో రిలీజ్ చేసి వార్తను వెల్లడించారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. అప్పటి నుంచి ఎస్పీ బాలు హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు.


Click it and Unblock the Notifications











