మెరుగుపడిన బాలు ఆరోగ్యం.. సామూహిక ప్రార్థనలకు ఆర్పీ పట్నాయక్ పిలుపు
కరోనావైరస్ పాజిటివ్ బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు ప్రపంచ వ్యాప్తంగా సంగీత అభిమానులను ఆందోళనకు గురిచేసింది. కొద్ది రోజుల క్రితంఆరోగ్యం విషమంగా మారడంతో ఐసీయూ నుంచి వెంటిలేటర్‌పైకి మార్చడంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులందరూ ప్రార్థిస్తున్నారు. తాజాగా బాలు ఆరోగ్యం గురించి ఆయన సోదరి ఎస్పీ శైలజ, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ తెలిపారు.
అన్నయ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం రోజు రోజుకు మెరుగుపడుతున్నది. వెంటిలేటర్ తీసివేశారు. మునపటి కంటే ఇప్పుడు ఆరోగ్యం మరింత మెరుగుపడింది. ప్రపంచంలోనే ఆయన అభిమానులందరూ కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. అందరి ప్రార్థనలు, దీవెనలతో సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారు అని ఎస్పీ శైలజ మీడియాకు ఆడియో ఫైల్ ద్వారా సమాచారాన్ని చేరవేశారు.

బాలు గారి ఆరోగ్యం కుదుట పడాలని అందరూ ప్రార్థిస్తున్నందుకు ధన్యవాదాలు. అందరం కలిసి సామూహిక ప్రార్థనలు చేస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉండి.. ఆయన త్వరగా కోలుకొవడానికి అవకాశం ఉందని భావిస్తున్నాం. అందుకోసం సినీ మ్యూజిక్ అసోసియేషన్ తరఫున ఈ రోజు సాయంత్రం అంటే ఆగస్టు 18వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు సామూహిక ప్రార్థనలు చేయాలని నిర్ణయించాం. సాయంత్రం 6 గంటల సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలు అభిమానులందరూ ఎక్కడ ఉన్నా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా మనస్ఫూర్తిగా ఓ నిమిషమైనా ప్రార్థన చేసి పాజిటివ్ ఎనర్జినీ అందించాలని కోరుకొంటున్నాం అని ఆర్పీ పట్నాయక్ తెలిపారు.
నా మాదిరిగానే వీడియోను చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసి ఎంతమందికి వీలైతే అంతమందికి చేరేలా చూడండి. కనీసం టెక్ట్స్ మెసేజ్ గానీ, ఇతర రూపంలో గానీ సామూహిక ప్రార్థన గురించిన సందేశాన్ని చేరవేయండి అంటూ ఆర్పీ రిక్వెస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











