ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు ఎప్పుడు.. ఎక్కడ అంటే
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణ వార్త సంగీత అభిమానులను, ప్రియులను కంటతడి పెట్టిస్తున్నది. గత 50 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ శాశ్వత నిద్రలోకి జారుకొన్నారు. ఆయన మృతితో భారతీయ సినిమా పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణవార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం..

శోక సంద్రంలో సంగీత అభిమానులు
ఆగస్టు 5వ తేదీ నుంచి చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలు శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు ఎస్పీ చరణ్ మీడియాకు స్వయంగా వెల్లడించారు. ఆ వార్త వినగానే అభిమానులు గుండె పగిలేలా రోదించారు. విషాద వార్తను జీర్ణించుకోలేక తల్లడిల్లిపోయారు.

తమిళ ప్రభుత్వ అధికార లాంఛనాలతో
ఎస్పీ బాలసుబ్రమణ్యం తమిళనాడు సర్కార్ ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. చెన్నైలోని ఆయన ఫామ్‌హౌజ్‌లో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్ హిల్స్ నుంచి తిరువళ్లూరు వెళ్లే మార్గంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో దహన సంస్కారాలు చేయనున్నట్టు తెలిపారు. ఎంజీఎం హాస్పిటల్ నుంచి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన భౌతికకాయాన్ని ఇంటికి తీసుకు వస్తారు.

అభిమానుల సందర్శనార్థం చెన్నైలో
తమ అభిమాన గాయకుడు ఎస్పీ బాలును కడసారి దర్శించుకొనేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. చెన్నైలోని సత్యం థియేటర్‌కు సమీపంలోని తన నివాసం వద్ద పార్దీవ దేహాన్ని ఉంచుతారు. శనివారం ఉదయం ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Recommended Video

చివరి చూపు కోసం సినీ ప్రముఖులు
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య క్షీణించిందనే వార్తల నేపథ్యంలో ఇప్పటికే సినీ ప్రముఖులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు గత రాత్రి నుంచే చెన్నైకి చేరుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు చెన్నైకి చేరుకొన్నారు. అశ్రనయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలుకుతున్నారు.

ఫామ్‌హౌజ్‌కు ఎస్పీబాలు మృతదేహం
ఎస్పీ బాలసుబ్రమణ్యం పార్దీవదేహాన్ని అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఆయన నివాసం వద్ద ఉంచారు. అయితే అభిమానులు రద్దీ ఎక్కువ కావడంతో ఆయన భౌతికకాయాన్ని శుక్రవారం రాత్రి తిరువల్లోరి జిల్లాలోని థమరైపాక్కమ్ గ్రామంలో ఉన్న ఆయన ఫామ్‌హౌజ్‌కు తరలించారు. అక్కడే ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.


Click it and Unblock the Notifications











