తీవ్ర విషాదంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు.. చిన్న కుమార్తె మృతి!
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలోనే ఉమామహేశ్వరి కన్నుమూసినట్లుగా చెబుతున్నారు. ఆమె మరణ వార్త తెలియగానే ఒక్కసారిగా నందమూరి ఫ్యామిలీలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.
ఉమామహేశ్వరి మొదట గుండెపోటుతో మరణించినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఆమె తీవ్ర ఒత్తిడి కారణంగా అలాగే పలు అనారోగ్య సమస్యల వలన మనోవేదన చెంది ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇక అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక ఆమె చనిపోయిన విషయం తెలియగానే నందమూరి కుటుంబ సభ్యులు హీరోలు అలాగే నారా చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా వారి ఇంటికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఉమామహేశ్వరి కుమార్తె పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఇక నిశ్చితార్థ సమయంలోనే చాలా రోజుల తర్వాత చంద్రబాబు వారి కుటుంబ సభ్యులను కూడా ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇక అందరికంటే ముందుగానే నారా లోకేష్ ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా వారి స్వగృహానికి బయలుదేరారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ చేదు వార్త గురించి తెలియగానే కళ్యాణ్ రామ్ హుటాహుటిన ప్రమోషన్స్ వదిలేసి తారక్ తో కలిసి వారి ఇంటికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. సీనియర్ ఎన్టీఆర్ కు మొత్తం నలుగురు కుమార్తెలు. ఏడుగురు కొడుకులు. దగ్గుపాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, గరపాటి లోకేశ్వరి తరువాత నాలుగవ కుమార్తెగా కంటమనేని ఉమామహేశ్వరి జన్మించారు.


Click it and Unblock the Notifications











