Raja Raja Chora Teaser: మరోసారి మాయ చేసిన శ్రీ విష్ణు.. టీజర్ అదిరిందిగా
తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకడు. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. అప్పటి నుంచి వైవిధ్యమైన చిత్రాలతో విలక్షణమైన నటనతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. తద్వారా పలు విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది 'గాలి సంపత్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చిన అతడు.. ఆ ఫలితంతో సంబంధం లేకుండా మరో సినిమా చేస్తున్నాడు. అదే 'రాజ రాజ చోర'.
హసిత్ గోలి అనే నూతన దర్శకుడితో యంగ్ హీరో శ్రీ విష్ణు చేసిన చిత్రమే 'రాజ రాజ చోర'. తాజాగా ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పటి లాగే ఇందులో కూడా ఈ యంగ్ హీరో తనదైన శైలి విలక్షణమైన యాక్టింగ్‌తో మాయ చేశాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని చెప్పుకుంటూ దొంగతనాలు చేసే వాడిగా ఇందులో హీరోను పరిచయం చేశారు. అలాగే, అతడిని పట్టుకోడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్‌గా రవిబాబు కనిపించాడు. ఇక, ఇందులో గంగవ్వ కూడా కీలక పాత్రను చేస్తోంది. మొత్తంగా ఈ టీజర్ ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'రాజ రాజ చోర' సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా తెరకెక్కించారు. ఇందులో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే ఎమోషన్స్‌తో పాటు అందరినీ నవ్వించే కామెడీ ట్రాక్స్ కూడా పెట్టినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఇక, ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. వివేక్ సాగర్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications











