దొంగలున్నారు జాగ్రత్త అంటోన్న శ్రీ సింహా: రాజమౌళి ఫ్యామిలీ హీరో ఊహించని విధంగా!
ఈ మధ్య కాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విజయాలను అందుకుని మంచి ఆరంభాలను అందుకున్నారు. మిగిలిన వాళ్లు మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా సక్సెస్‌ను మాత్రం ఖాతాలో వేసుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి కుమారుడిగా సినీ రంగానికి పరిచయం అయిన శ్రీ సింహా కోడూరి ఒకడు. 'మత్తు వదలరా' అనే మూవీతో ఇతగాడు హీరోగా పరిచయం అయ్యాడు. ఇది మంచి టాక్‌ను తెచ్చుకున్నా సక్సెస్‌ను మాత్రం దక్కించుకోలేకపోయింది.
'మత్తు వదలరా' వంటి ప్రయోగాత్మక చిత్రం తర్వాత శ్రీ సింహా 'తెల్లవారితే గురువారం' అనే సినిమాలో నటించాడు. టైటిల్‌లోనే కొత్తదనం ఉండడంతో ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే పోస్టర్, టీజర్, ట్రైలర్లు విడుదల అయిన తర్వాత మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికితోడు ప్రమోషన్ కూడా అదిరిపోయేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్, రాజమౌళిని తీసుకొచ్చి హైలైట్ చేశారు. కానీ, దీనికి ప్రేక్షకుల నుంచి మాత్రం అనుకున్న రీతిలో స్పందన రాలేదు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిరాశనే మిగుల్చుకుంది.

ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న శ్రీ సింహా కోడూరి.. ప్రస్తుతం మరో ప్రాజెక్టులోనూ భాగం అయ్యాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈరోజు శ్రీ సింహా పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక, ఈ చిత్రానికి 'దొంగలున్నారు జాగ్రత్త' అనే టైటిల్‌ను పెట్టారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో హీరోను ఒక చైర్‌లో బంధించడం.. గూగుల్ లొకేషన్స్.. రోడ్ మీద కారు వెళ్తుండడం.. ఆ వెంటనే యూటర్న్.. మరీ ముఖ్యంగా సీసీ కెమెరా వంటి విజువల్స్‌ను చూపించారు. దీంతో ఈ సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతున్నట్లు అర్థం అవుతోంది.
ఇదిలా ఉండగా.. ప్రయోగాత్మక కాన్సెప్టుతో రూపొందుతోన్న 'దొంగలున్నారు జాగ్రత్త' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా విడుదల చేశాడు. అలాగే, మరికొందరు ప్రముఖులు సైతం దీనిని సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. మొత్తంగా శ్రీ సింహా నటిస్తోన్న కొత్త సినిమా పోస్టర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. చిత్ర యూనిట్ చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి పాజిటివ్ రిప్లైలు వస్తున్నాయి. దీంతో ఆరంభంలోనే ఈ సినిమా అందరి దృష్టిలో పడిపోయింది. ఫలితంగా అప్పుడే దీనిపై అంచనాలు కూడా భారీ స్థాయిలోనే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు.
క్రేజీ కాంబినేషన్‌లో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న 'దొంగలున్నారు జాగ్రత్త' సినిమాను సతీష్ త్రిపుర తెరకెక్కిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, గురు ఫిల్మ్స్, మంజర్ స్టూడియోస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని దగ్గుబాటి సురేష్ బాబు, తాటి సునీత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి కీరవాణి మరో కుమారుడు కాల భైరవ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీని ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











