నెగిటివ్ రివ్యూలపై ఫైర్ .. నా కొ*** లు అంటూ.. లైవ్‌లోనే టాలీవుడ్ నటుడి బూతు పురాణం
ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి , నానా కష్టాలు పడి సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ ఆ సినిమా థియేటర్ వరకు చేరడానికి అంతే కష్టపడాలి. థియేటర్‌కు ప్రేక్షకుడిని రప్పించడం, వచ్చిన వాడిని సీట్లో కూర్చోబెట్టడం అంత ఈజీ కాదు. మహా మహా దర్శక దిగ్గజాలే ఈ విషయంలో ఫెయిలైన దాఖలాలు మన కళ్ల ముందే ఉన్నాయి. అయితే సినిమాకు, ప్రేక్షకుడి మధ్య కొందరు చేరి ఆ కనెక్షన్‌ని చెడగొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్కురి తెరకెక్కించిన చిత్రం పోట్టెల్. ఏ ముహుర్తాన ఈ సినిమాను మొదలుపెట్టారో కానీ దీని చుట్టూ వివాదాలే ముసురుకుంటున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కొద్దిరోజుల క్రితం హీరోయిన్ అనన్య నాగళ్లను ఓ జర్నలిస్ట్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించారు. తప్పించుకోవాలని చూసినా, సదరు జర్నలిస్ట్ ఏమాత్రం వదలకపోవడంతో అనన్య ఇబ్బంది పడింది. ఇన్నేళ్ల కెరీర్‌లో తాను సంపాదించుకున్న పరువు మొత్తం పోయిందన్నట్లుగా వ్యవహరించింది.

ఫీమేల్ ఆర్టిస్టులు మేకప్ వేసుకుని నవ్వుతూ కనిపిస్తుంటారని అనుకోవద్దని.. మాకూ రెస్పెక్ట్ ఇవ్వాలని వేడుకుంటున్నానని అనన్య పేర్కొంది. అటు ఈ ఇష్యూ తెలుగు ఫిలిం ఛాంబర్ వరకు వెళ్లడంతో ఈ సంస్థ కూడా సీరియస్ అయ్యింది. జర్నలిస్టుల సంఘానికి లేఖ రాసింది. అనన్యను ప్రశ్నలు అడిగిన జర్నలిస్ట్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫారసు చేసింది. సదరు మహిళా జర్నలిస్ట్ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఛాంబర్‌ను సంప్రదిస్తే , చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ఈ ఇష్యూ సద్దుమణగక ముందే ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో శనివారం పోట్టెల్ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. తాను ముక్కుసూటిగా మాట్లాడతానని అన్నారు. దరిద్రానికి వీరేచనాలు వస్తే రివ్యూ రైటర్లు పుడతారట , క్రిముల దొడ్డి నాకేటోళ్లు అంటూ నోరు పారేసుకున్నారు. అందరం కలిసి ఇలాంటి వాళ్లని ఆపేయాలని , జీవితంలో షార్ట్ ఫిల్మ్ తీయడం రాని వాళ్లు వచ్చి నోటికొచ్చినట్లు రాస్తున్నారంటూ అసభ్యపదజాలంతో దూషించారు.
పొట్టేల్ సక్సెస్ మీట్ లో ..తెలుగు సినిమా ల కు రివ్యూ లు రాసే వాళ్ళని తిట్టిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ .. మామూలు తిట్లు కాదు.. pic.twitter.com/UdZnqYPibL
— H A N U (@HanuNews) October 26, 2024
మాకు ప్రజలున్నారని, వాళ్లే సినిమాను ముందుకు తీసుకెళ్తారని , మీ రివ్యూలు మాకేం అక్కర్లేదని శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రమించి, ప్రాణాలు పణంగా పెట్టి సినిమాలు తీస్తూనే ఉంటామని .. ప్రేక్షకులు ఆదరిస్తారని.. మీలాంటి వాళ్లు వస్తూ పోతూ ఉంటారంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫిల్మ్ జర్నలిస్టులు, క్రిటిక్స్ మండిపడ్డారు.
రివ్యూలు రాసే జర్నలిస్టులపై శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఆయన మాటలు మీడియా ప్రతినిధుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అసోసియేషన్ తన ఫిర్యాదులో పేర్కొంది. మరి దీనిపై మంచు విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, శ్రీకాంత్ అయ్యంగార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











