SSMB29: ఒరిస్సాలో మహేష్ బాబుతో షూటింగ్.. రాజమౌళిని వెంటాడుతున్న ఆ భయం!
ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చిత్రం SSMB 29. సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జక్కన్న. భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు ఏకంగా ప్రపంచ సినీ ప్రముఖులే ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుదీర్ఘ కసరత్తు, పలు అవాంతరాలను దాటుకుని ఈ సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. వీలైనంత త్వరగా ఎస్ఎస్ఎంబీ 29ను విడుదల చేయాలని రాజమౌళి పట్టుదలగా ఉన్నారు.
ఎస్ఎస్ఎంబీ 29 ప్రారంభమైన నాటి నుంచి ఈ సినిమా కథేంటీ? నటీనటులు? టెక్నీషియన్స్? బడ్జెట్ ఎంత అంటూ మహేశ్ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. కానీ ఇలాంటి విషయాల్లో రాజమౌళి ఎంత గోప్యత పాటిస్తారో తెలిసిందే. పలు ఈవెంట్స్‌లో మీడియా ప్రతినిధులు ఆయన నుంచి గుట్టు రాబట్టాలని అనుకున్నా అక్కడ ఉన్నది జక్కన్న. ఆయన ముందు ఇలాంటి పప్పులు ఉడకవు కదా.

ఎస్ఎస్ఎంబీ 29లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కీలకపాత్ర నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు హైదరాబాద్‌లో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రియాంకపై పలు గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే మహేశ్ పాస్‌పోర్ట్‌ని లాక్ చేసి.. సింహాన్ని బోనులో బంధిస్తూ రాజమౌళి రిలీజ్ చేసిన వీడియోకు ప్రియాంక లైక్ , కామెంట్ పెట్టడంతో ఈ సినిమాలో ఆమె ఉన్నట్లు జనానికి కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈమెది హీరోయిన్ పాత్రా? లేక మరేదైనా కీ రోలా? అన్నది మాత్రం తెలియరాలేదు.
అయితే షూటింగ్ ప్రారంభమైన కొద్దిరోజులకే తన సోదరుడి వివాహాం నిమిత్తం ఆమె బ్రేక్ తీసుకుని .. అన్ని పనులు పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చారు. పనిలో పనిగా ముంబైలో ఉన్న తన ఆస్తుల్ని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు ప్రియాంక. ఇటీవల నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన అంధేరీలో నాలుగు ఫ్లాట్లను రూ.16 కోట్లకు విక్రయించినట్లుగా బీటౌన్‌లో వార్తలు వస్తున్నాయి. ఓ వైపు సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే, తన పనుల్ని సైతం చక్కబెట్టుకుంటున్నారు ప్రియాంక చోప్రా.
ఇక ఎస్ఎస్ఎంబీ 29లో పలువురు స్టార్ హీరోలు నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. దానిని నిజం చేస్తూ మహేశ్, పృథ్వీరాజ్‌లు ఒడిషా ఎయిర్‌పోర్టులో పోలీసులకు షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
హైదరాబాద్ అల్యూమినీయం ఫ్యాక్టరీలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబీ 29 యూనిట్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఒడిషాలో అడుగుపెట్టింది. ఇక్కడి కోరాపుట్ జిల్లాలో ఉన్న ప్రదేశాలలో చిత్రీకరణ నిర్వహిస్తున్నారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించడంతో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఒడిషాలో షూటింగ్ ముగిసిన తర్వాత విశాఖ.. శ్రీలంక, కెన్యా దేశాలలో షూటింగ్ జరుపుకోనుంది.
ఎస్ఎస్ఎంబీ 29 ఫోటోలు, సీన్స్, క్లిప్స్ ఎక్కడా లీక్ కాకుండా రాజమౌళి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు రాజమౌళి. అయితే ఇటీవల మహేశ్ బాబు జిమ్‌లో వర్కవుట్ చేస్తూ కనిపించిన వీడియో లీక్ కావడంతో జక్కన్న యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకులు వస్తుండటంతో చిత్ర యూనిట్ తలపట్టుకుంది. అంతేకాదు.. ఒడిషాలోని టీవీ ఛానెల్స్, అక్కడి ప్రజలు సినిమా సెట్ నిర్మాణాన్ని విస్తృతంగా కవర్ చేయడంతో పాటు నిరంతరాయంగా లీకులు బయటకు వస్తుండటం రాజమౌళికి సవాల్‌గా మారింది.
మీడియా సిబ్బంది, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సెట్స్ వద్దకు వచ్చి వీడియోలు , ఫోటోలు తీసుకుంటూ ఉండటంతో మహేశ్ బాబు సహా మిగిలిన నటీనటుల లుక్స్ బయటకు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా దాని కథాంశం, విజువల్స్ చుట్టూ గోప్యతను కొనసాగించాలని భావిస్తున్నారు. ఇలాంటి వేళ లీకుల బెడద వారిని వేధిస్తోంది. ఈ పరిణామాలతో చిత్ర బృందం నిరాశ చెందడంతో పాటు లీకులను నివారించడానికి భద్రతను కట్టుదిట్టం చేసింది. మరి ఈ సవాలును రాజమౌళి అతని టీమ్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











