‘సోలో బ్రతుకే సో బెటర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్: గెస్టుగా ఊహించని వ్యక్తి
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనలోని టాలెంట్‌ను నిరూపించుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభంలో మంచి సినిమాలతో సత్తా చాటినప్పటికీ.. ఆ తర్వాత పరాజయాల పరంపరతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడతడు. ఇలాంటి పరిస్థితుల్లో 'చిత్రలహరి', 'ప్రతిరోజూ పండగే' వంటి వరుస హిట్లతో ఫామ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు సుబ్బు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమాలో నటించాడు. నభా నటేష్ ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది.
ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ.. కరోనా వైరస్ ప్రభావంతో 'సోలో బ్రతుకే సో బెటర్' విడుదల వాయిదా పడింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో పాటు థియేటర్లు పున: ప్రారంభం అవడంతో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇక, విడుదలకు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేశారు. అందుకు అనుగుణంగానే డిసెంబర్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చేయబోతున్నారు.

హైదరాబాద్‌లోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో 'సోలో బ్రతుకే సో బెటర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, దీనికి ముఖ్య అతిథిగా దర్శకధీరుడు రాజమౌళి రాబోతున్నారని కూడా తెలుస్తోంది. ఆయనతో పాటు మెగా హీరోల్లో ఎవరైనా ఒకరు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇదిలా ఉండగా, ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఇక, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











