మా వాళ్లు చేసింది దారుణం.. కన్నీటితో విజయేంద్రప్రసాద్ క్షమాపణలు, ఏం జరిగిందంటే?
వీ విజయేంద్రప్రసాద్... పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ రైటర్‌గా ఎన్నో హిట్ చిత్రాలకు కథలను అందించిన వ్యక్తి. రైటర్‌గానే కాకుండా డైరెక్టర్‌గానూ సక్సెస్ అయ్యారు విజయేంద్రప్రసాద్. రాజ్యసభ సభ్యుడిగానూ వ్యవహరిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి ఆయన స్వయానా తండ్రి. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణికి చిన్నాన్న. ప్రస్తుతం సూపర్‌స్టార మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న వారణాసి చిత్రానికి కథను అందిస్తున్నారు విజయేంద్రప్రసాద్. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన విజయేంద్రప్రసాద్.. తన సోదరుడు శివశక్తి దత్తాతో కలిసి సినీరంగం వైపు అడుగులు వేశారు. జానకీరాముడు సినిమాతో స్క్రిప్ట్ రైటర్‌గా చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత బంగారు కుటుంబం, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, సరదా బుల్లోడు, సమరసింహారెడ్డి, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి సిరీస్, జాగ్వార్, ఆర్ఆర్ఆర్, బాహుబలి ది ఎపిక్ వంటి సినిమాలతో బజరంగీ భాయిజాన్, మెర్సెల్, తలైవి వంటి పరభాషా చిత్రాలకు కూడా కథలు అందించారు విజయేంద్రప్రసాద్. అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన రాజన్నతో పాటు శ్రీవల్లి అనే సినిమాకు దర్శకత్వం వహించి డైరెక్టర్ అనిపించుకున్నారు.

అన్నలు, తమ్ముళ్లు, కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు మనవళ్లు, మనవరాళ్లు ఇలా విజయేంద్రప్రసాద్ కుటుంబం మొత్తం సినీ కళామతల్లి సేవలోనే తరిస్తోంది. కొడుకు దేశం గర్వించదగ్గ దర్శకుడైనా విజయేంద్రప్రసాద్ ఒదిగే ఉంటారు. సినిమాలతో పాటు సమకాలీన అంశాలపైనా స్పందిస్తుంటారు విజయేంద్రప్రసాద్. మనసులో ఎలాంటి విషయమైనా సరే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆయన స్టైల్. ఈ విషయంలో ఎన్నిసార్లు ఎన్ని విమర్శలొచ్చినా సరే విజయేంద్రప్రసాద్ మాట మీదే ఉంటారు. దేశం నేరచరిత్ర ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావడం పట్ల ఆయన ఓ సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని 40 శాతం మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని .. దీనిని ప్రజాస్వామ్యం అనలేమని, ఇది సిగ్గుపడే విషయమని విజయేంద్రప్రసాద్ మండిపడ్డారు.
తాజాగా ఫిబ్రవరి 17న హైదరాబాద్ రవీంద్రభారతిలో మాతా రాంబాయి అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాతా రాంబాయి అంబేద్కర్ స్మారక పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు మాది సంపన్న కుటుంబం. నాకు తెలిసి నేనెప్పుడూ తప్పు చేయలేదు. కానీ మా తాతలు, ముత్తాతలు నోటితో చెప్పలేని దారుణాలు చేశారు. నాటి పరిస్ధితులు తలచుకున్నప్పుడు మనసు సిగ్గుతో కుంగిపోతోంది. మీ అందరి ముందు తలవంచి వినయంగా చెబుతున్నా.. క్షమించండి.. క్షమించండి అంటూ ఎమోషనల్ అయ్యారు.
తన కార్యాలయంలో ఇప్పటికీ అంబేద్కర్ ఫోటో మాత్రమే ఉంటుందని.. ప్రస్తుతం ఆయనపై ఓ సినిమా కోసం కథ రాస్తున్నా.. దీనికి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నానని విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రస్తుం ఆయన క్షమాపణలు చెప్పడం, ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పెద్దాయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











