సినీ తారలకు భద్రత ఎంత? ఫ్యాన్స్ పేరుతో అరాచకాలు..!
బాలీవుడ్ సూపర్‌స్టార్ సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి బంగ్లాదేశ్‌కు చెందిన దుండగుడు ప్రవేశించడం భారతీయ చిత్ర పరిశ్రమలో కలకలం రేపింది. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో లోపలికి చొరబడిన అగంతకుడిని పనివాళ్లు పట్టుకోవడంతో గాఢ నిద్రలో ఉన్న సైఫ్ అలీఖాన్ నిద్రలేచారు. తప్పించుకునే ప్రయత్నంలో సైఫ్‌పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు దుండగుడు. ఈ ఘటనలో సైఫ్ తీవ్రగాయాల పాలవ్వగా.. అదృష్టవశాత్తూ సకాలంలో చికిత్స అందించడంతో ఆయన తృటిలో ప్రాణాలు దక్కించుకోగలిగారు.
సల్మాన్‌ను వేటాడుతోన్న బిష్ణోయ్ గ్యాంగ్
సైఫ్ అలీఖాన్‌పై దాడి సంఘటన సినీతారల నివాసాలలో భద్రతా లోపాలు బయటపెట్టింది. కోట్లాదిమంది ప్రాణంగా ప్రేమించుకునే స్టార్స్‌ను ఈజీగా లక్ష్యంగా చేసుకోవచ్చనే చర్చ జరిగింది. ఇప్పటికే బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్.. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలను ఎదుర్కొన్నారు. కృష్ణజింకలను వేటాడినందుకు ప్రతీకారంగా సల్మాన్‌ను హతమారుస్తామని గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే ఆయన హత్యకు పలుమార్లు విఫలయత్నం చేసింది. సల్మాన్ ఇంటి వద్ద రెక్కీ, అనుమానాస్పద వ్యక్తుల సంచారంతో కండలవీరుడికి కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తోంది.

రామ్ పోతినేనికి చేదు అనుభవం
రెండ్రోజుల క్రితం టాలీవుడ్ యువనటుడు రామ్ పోతినేనికి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమాలో రామ్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మహేశ్ బాబు పీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. చిత్రీకరణ నేపథ్యంలో చిత్ర యూనిట్ రాజమండ్రిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసింది. రామ్ ప్రత్యేకంగా వీఐపీ రూమ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు రామ్ బస చేస్తున్న గదికి వెళ్లి తలుపులు కొట్టారు. దీనిపై రామ్ తన సిబ్బందికి సమాచారం అందించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వాళ్లు తాగుబోతులని తేలింది.
నాగార్జున ఇంట్లోకి దుండగులు
ఈ ఘటన మరిచిపోకముందే టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున నివాసంలోకి అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడటంతో కలకలం రేగింది. నాగ్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను కలిసేందుకు ప్రతిరోజూ తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు తరలి వస్తుంటారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నాగార్జున నివాసంతో పాటు అన్నపూర్ణ స్టూడియోలో ఆయనను కలుస్తుంటారు. అలాంటిది అక్కినేని అభిమానుమని చెప్పుకుంటూ నలుగురు వ్యక్తులు నాగ్ ఇంట్లోకి చొరబడినట్లు తెలుస్తోంది.
మీరు ఫ్యాన్స్ కాదంటూ అమల అగ్రహం
అయితే అభిమానులను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోండని సున్నితంగా అమల మందలించారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ వీడియో ఎప్పటిది? నాగార్జున ఇంటికి వచ్చిందెవరు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాలతో స్టార్స్ భద్రత విషయం మరోసారి చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











