హిందీలో ఛాన్స్ వచ్చినా.. చిరు కోసం వెళ్లలేదట..!
భారీ అంచనాల నడుమ విడుదలైన సాహో సినిమా నార్త్ లో సక్సెస్ అయినా.. సౌత్ లో మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ చేసిన ప్రయోగం ఒక చోట హిట్టయితే మరొక చోట నిరాశపరిచింది. అసలు మ్యాటర్ లోకి వస్తే దర్శకుడు సుజిత్ కి మాత్రం ఆ సినిమా మంచి గుర్తింపే అందించింది. సినిమా కాస్త క్లిక్కయినా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకునేదని బడా నిర్మాతలు అభిప్రాయపడ్డారు.
ఇకపోతే సాహో అనంతరం సుజిత్ మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమాను ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. లూసిఫర్ రీమేక్ ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే మెగాస్టార్ ఆఫర్ ఇవ్వకముందే సుజిత్ కి బాలీవుడ్ నుంచి పలు ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సాహో సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకోవడంతో కొంతమంది హీరోలు ఈ కుర్ర దర్శకుడి గురించి చర్చించారట.

లూసిఫర్ కోసం ఒప్పుకునే ముందు రోజు వరకు కూడా బాలీవుడ్ బడా నిర్మాతలు సుజిత్ ని కలవడానికి ట్రై చేశారట. చర్చలు జరుగుతున్న సమయంలో మెగాస్టార్ పిలిచి మరి ఆఫర్ ఇవ్వడంతో తెలుగు సినిమాతోనే మళ్ళీ తన సత్తా చూపించాలని సుజిత్ ప్రయత్నాలు చేస్తున్నాడు. దాదాపు తన స్టైల్ లోనే ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన సుజిత్ మెగాస్టార్ కోసం మరొకసారి కొత్త తరహాలో కథను వినిపించనున్నాడట. ఫైనల్ గా ఈ సమ్మర్ లోనే పరిస్థితులను బట్టి సినిమాను స్టార్ట్ చేయాలని మెగాస్టార్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











