మెగా హీరో సినిమాలో నటిస్తున్న సుకుమార్.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. అతడు చేసిన రెండు మూడు చిత్రాలు మినహా మిగిలినవన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కథల ఎంపికలో వైవిధ్యం చూపడంతో పాటు ప్రయోగాలకూ వెనుకాడకపోవడంతో వరుణ్ తేజ్ కెరీర్ సాఫీగా సాగుతోంది. అందుకే అతడి మార్కెట్ కూడా సినిమా సినిమాకూ పెరిగిపోతోంది. దీంతో ఈ మెగా హీరో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుణ్ 'వాల్మీకి' అనే సినిమా చేస్తున్నాడు.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ సూపర్ హిట్ చిత్రం 'జిగర్తాండ'కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే, తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషిస్తున్నాడు. పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో 'వాల్మీకి' గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇందులో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఓ పాత్రను చేస్తున్నాడట. కొద్ది నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర కోసం హరీశ్ శంకర్ ఆయనను సంప్రదించారట. దీనికి ఆయన వెంటనే ఓకే చెప్పేశారని తెలుస్తోంది. దీనికితోడు ట్విట్టర్‌లో వీళ్లు సమావేశం అయిన ఫొటోలు వైరల్ అవడంతో ఇది నిజమేనన్న టాక్ వినిపిస్తోంది. సుకుమార్ త్వరలోనే అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమాను చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.


Click it and Unblock the Notifications











