‘రౌడీ బేబీ’ పేరును మార్చేసిన యంగ్ హీరో: త్వరలోనే మరొకటి పెడతామని ప్రకటన
టాలెంట్ ఉన్నా సరైన హిట్లు దక్కించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న హీరోలు తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు సందీప్ కిషన్. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ప్రవేశించిన అతడు.. కెరీర్ ఆరంభంలో వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' తర్వాత చాలా కాలం పాటు హిట్ రుచిని ఆస్వాదించలేదు. అయితే, ఈ మధ్య వచ్చిన 'నిను వీడని నీడను నేనే'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కినా.. మళ్లీ నిరాశే ఎదురైంది. ఇలాంటి సమయంలో ఇటీవల 'ఏ1 ఎక్స్‌ప్రెస్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లు రాబట్టలేదు.
జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు సందీప్ కిషన్. ఇందులో భాగంగానే ప్రస్తుతం అతడు జీ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి విచిత్రం 'రౌడీ బేబీ' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. విశాఖపట్నం నగరం నేపథ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రం గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

సందీప్ కిషన్ నటిస్తోన్న ఈ సినిమాకు 'రౌడీ బేబీ' అని పెట్టిన టైటిల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తాజాగా యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన కోన ఫిల్మ్ కార్పోరేషన్ ట్విట్టర్‌లో 'కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మా రౌడీ బేబీ టైటిల్‌ను మార్చేస్తున్నాం. త్వరలోనే మరింత ఆసక్తికరమైన కొత్త టైటిల్‌ను ప్రకటిస్తాం. ఆ వివరాలు తొందరలోనే వెల్లడిస్తాం' అంటూ పోస్ట్ చేసింది. వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే నాగేశ్వర్ రెడ్డి.. దీన్ని ఎంతో ఫన్నీగా రూపొందిస్తున్నారట. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ కాగా, బాబీ సింహా కీలక పాత్ర చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











