సారీ అన్నయ్య.. రామ్ చరణ్ మిమ్మల్ని దాటేశాడు , చిరంజీవి ఎదుటే సునీల్ సంచలన వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చారు రామ్ చరణ్ తేజ్. డ్యాన్సులు, ఫైట్లు, నటనలో తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకోవడానికి చెర్రీకి పెద్దగా టైం పట్టలేదు. అలా అని ఆయన కెరీర్ సాఫీగా సాగిపోయిందని కాదు. నటన, లుక్స్ పరంగా చరణ్‌పై ట్రోలింగ్ జరిగింది.. అయినప్పటికీ తట్టుకుని నిలబడ్డారు చరణ్. చిరుతతో నటనలో మంచి మార్కులు వేయించుకున్న ఆయనను మగధీర పూర్తిగా మార్చేసింది.
ఎవరి నుంచి ఎంత పిండుకోవాలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి బాగా తెలుసు. అప్పటికే అపజయం అనేది లేకుండా వరుసగా ఆరు బ్లాక్‌బస్టర్లు కొట్టడంతో చిరంజీవి, చరణ్‌ను జక్కన్న చేతిలో పెట్టారు. గత చిత్రాలన్నీ మాస్, మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్‌లు కాగా.. రాజమౌళి ఫస్ట్ టైమ్ చారిత్రక, జానపద నేపథ్యాల జోలికి వెళ్లారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ ఖర్చుకు వెనుకాడకుండా రూ.44 కోట్ల బడ్జెట్‌తో మగధీరను నిర్మించారు. పునర్జన్మ, పగ, ప్రతీకారం ఇతివృత్తంతో తెరకెక్కిన మగధీరలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీహరి, దేవ్ గిల్ కీలకపాత్రలు పోషించారు.

అప్పటికే టీజర్, ట్రైలర్, చరణ్ లుక్స్‌కు తోడు రాజమౌళి దర్శకుడు కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. 2009 జూలై 30న విడుదలైన మగధీర బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించి రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌ను జక్కన్న డీల్ చేసిన విధానం , చరణ్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుని .. చెర్రీ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోగా, రాజమౌళి టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా నిలిచి ఆయనతో సినిమా చేస్తే హిట్ గ్యారెంటీ అనే ముద్ర బలంగా పడింది.
రెండు జాతీయ చలన చిత్ర పురస్కారాలు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 9 నంది పురస్కారాలను మగధీర కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1250 థియేటర్లలో, 625 డిజిటల్ యుఎఫ్ఓ మూవీజ్ ప్రింట్లతో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఒక తెలుగు చిత్రం ఆ రేంజ్‌లో విడుదల కావడం అప్పట్లో అదే తొలిసారి. హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయగా అక్కడా హిట్ కొట్టింది.

మగధీరలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ డ్యాన్స్. ఆయనలోని డ్యాన్సింగ్ స్కిల్స్ ఈ మూవీలో పూర్తిగా బయటికొచ్చాయి. చిరంజీవి బ్లాక్‌బస్టర్ మూవీ 'ఘరానా మొగుడు'లోని బంగారు కోడిపెట్ట సాంగ్‌ను రీమిక్స్ చేశారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫి చేసిన స్టెప్స్‌ను చరణ్ అద్భుతంగా చేశాడు. టెక్నాలజీ సాయంతో ఘరానా మొగుడులోని బంగారు కోడిపెట్టకు చిరంజీవి వేసిన స్టెప్స్‌ను ఇందులో చూపించగా.. చరణ్ దానిని యాజిటిజ్‌గా చేసి ఔరా అనిపించుకున్నారు.
ఇదే విషయాన్ని ఆడియో లాంచ్ సందర్భంగా సునీల్ ప్రస్తావించారు. డ్యాన్స్ విషయంలో చిరంజీవిని కొట్టేవారు లేరు.. అలాంటిది సారీ అన్నయ్య , మిమ్మల్ని చరణ్ దాటేశారని , చింపి ఎగరేస్తే పీసులు కనపడలేదని ప్రశంసించారు. సునీల్ మాటలకు కుర్చీలో కూర్చొన్న మెగాస్టార్ చప్పట్లు కొడుతూ మురిసిపోయారు. మగధీర రిలీజై 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సునీల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











