రాజమౌళికి షాక్ .. SSMB 29లో మహేశ్ న్యూ లుక్ లీక్, సెక్యూరిటీ కళ్లు కప్పి ఎలా?
ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి .. సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. SSMB 29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవలే లాంచ్ చేశారు. ఎస్ఎస్ఎంబీ 29 నుంచి పెద్దగా ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో మహేశ్ అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఓ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఎస్ఎస్ఎంబీ 29 ప్రారంభమైన నాటి నుంచి ఈ సినిమా కథ ఏంటీ? ఎవరెవరు నటిస్తున్నారు? మహేశ్ ఎలా ఉంటారు? బడ్జెట్ ఎంత అంటూ సోషల్ మీడియాతో తెగ డిస్కషన్ నడుస్తోంది. స్వయంగా థియేటర్‌లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తోన్న దర్శకుడు రాజమౌళినే సూపర్‌స్టార్ అభిమానులు చుట్టుముట్టి ఎస్ఎస్ఎంబీ 29 గురించి అప్‌డేట్స్ చెప్పమని విసిగించారంటే ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కానీ రాజమౌళి మాత్రం ముసి ముసి నవ్వులు నవ్వుతూ తప్పించుకున్నారు.

ఎస్ఎస్ఎంబీ 29లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అయితే అది హీరోయిన్‌గానా? లేక మరేదైనా పాత్ర కోసమా? అన్నది మాత్రం తెలియరాలేదు. షూటింగ్ ప్రారంభమైన కొద్దిరోజులకే తన సోదరుడి వివాహాం నిమిత్తం ఆమె బ్రేక్ తీసుకుని .. పెళ్లి తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చారు. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్లుగా సోషల్ మీడియా టాక్. తొలి షెడ్యూల్ పూర్తి చేసి సమ్మర్‌కి ఫారిన్ చెక్కేయాలని రాజమౌళి భావిస్తున్నారట.
ఇక ఎస్ఎస్ఎంబీ 29లో పలువురు స్టార్ హీరోలు నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ఓ పాత్ర నిమిత్తం తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. తర్వాత కొద్దిరోజులకే ఈ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంను తీసుకున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. కానీ వీటిలో ఏది నిజమో? ఏది అబద్ధమో అనేది తెలియరాలేదు?.
రాజమౌళి తన సెట్‌లో చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారని పేరు. ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను సెట్‌లోకి అస్సలు రానివ్వరు జక్కన్న. సినిమా రిలీజ్ వరకు తను అనుకున్నది మాత్రమే చేస్తూ మధ్యలో పోస్టర్లు, ట్రైలర్లు, టీజర్లు రిలీజ్ చేస్తుంటారు. రాజమౌళి గత సినిమాల్లో లీకులు తక్కువే. అయినప్పటికీ ప్రస్తుతం ఇండస్ట్రీలో లీకులు, పైరసీ నేపథ్యంలో ఎస్ఎస్ఎంబీ 29 కోసం టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు జక్కన్న. అయినప్పటికీ ఆయన కళ్లు కప్పీ ఓ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా ఏకంగా హీరో మహేశ్ బాబుది కావడం గమనార్హం.
మహేశ్ బాబు జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ అద్దం ముందు తనను తాను చూసుకుంటున్న వీడియో అది. 14 సెకన్ల ఈ వీడియోలో మహేశ్ హెయిర్ స్టైల్ అచ్చుగుద్దినట్లు సింహం జూలు విదిల్చినట్లుగా ఉంది. ఈ లుక్‌లో సూపర్‌స్టార్ మామూలుగా లేడని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అయితే రాజమౌళి షూటింగ్ లోకేషన్ చూడటానికి వెళ్లినప్పుడు, మహేశ్ పాస్‌పోర్ట్‌ని లాక్ చేసినప్పుడు సింహం గురించి ప్రస్తావించారు. దీంతో సూపర్‌స్టార్ పాత్రపై ఇండస్ట్రీలో అంచనాలు పెరిగిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











