650 కోట్ల కలెక్షన్స్‌తో రజనీ ఊచకోత.. జపాన్‌లో దిగిన జైలర్ , RRR రికార్డ్స్‌పై కన్ను..!
పాన్ ఇండియా కల్చర్ ఇతరత్రా కారణాలతో భారతీయ చిత్ర పరిశ్రమ పరిధి, మార్కెట్ ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. భారతీయ భాషల్లో సినిమా రిలీజ్ చేసి మంచి లాభాలను అందుకుంటున్న మేకర్స్.. విదేశీ భాషల్లోనూ సినిమా విడుదల చేసేందుకు పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే దంగల్, ఆర్ఆర్ఆర్, మహారాజ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. తాజాగా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ కూడా విదేశాల్లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది.
రజనీకాంత్ వీరాభిమాని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2023 ఆగస్ట్ 10వ తేదీన విడుదలైన జైలర్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. రజనీ వయసుకు తగినట్లుగా పాత్రను డిజైన్ చేసి ఎక్కడా అసంతృప్తి కలగకుండా కథను నడిపించారు నెల్సన్. రజనీ హీరోయిజం, మేనరిజమ్స్, యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో జైలర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ , సునీల్, రమ్యకృష్ణ, తమన్నా, మీర్ణా మీనన్ , వినాయకన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

పోలీస్ ఆఫీసర్ అయిన కొడుకుని చంపిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కథే జైలర్. ఈ సినిమాను రజనీ మార్క్ వన్ మేన్ షోగా చెప్పవచ్చు. తాతయ్యగా , తండ్రిగా, నిజాయితీ గల పోలీస్ అధికారిగా సూపర్ స్టార్ ఒదిగిపోయారు. అనిరుధ్ సంగీతం, తమన్నా స్పెషల్ సాంగ్ అన్ని మాస్‌ను ఒక ఊపేశాయి. థియేట్రికల్ రన్ ముగిసేసరికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రజనీ స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఓటీటీలలో, టీవీలలో దుమ్మురేపిన జైలర్ సరికొత్త రికార్డులు సెట్ చేసింది.
అలాంటి జైలర్‌కు సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా ఈ సంక్రాంతికి జైలర్ 2 అనౌన్స్‌మెంట్ టీజర్‌తో ఫ్యాన్స్‌లో జోష్ తీసుకొచ్చారు రజనీ. జైలర్ 2 కథ, కథనం విషయంలోనూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు నెల్సన్. పార్ట్ 1లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో అతిథి పాత్రల్లో మెరిశారు. తాజాగా పార్ట్ 2లో నందమూరి బాలకృష్ణ సహా పలువురు గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇదిలాఉండగా.. రజనీకాంత్‌కు భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అప్పట్లోనే ఆయన సినిమాలు పలు భాషల్లో రిలీజై అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా జైలర్‌ను జపాన్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఫిబ్రవరి 21న ఈ సినిమా జపనీస్ భాషలో రిలీజైంది. 1998లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ముత్తు జపాన్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది.
2022 వరకు జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ముత్తు పేరిటే రికార్డ్ ఉండేది. అయితే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ జపాన్‌లో విడుదలై ముత్తు రికార్డులను బద్ధలు కొట్టింది. ఇప్పుడు జైలర్‌గా మరోసారి జపాన్ ప్రజలను పలకరించబోతున్నారు రజనీకాంత్. మరి చూద్దాం తలైవా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో?


Click it and Unblock the Notifications











