జూ.ఎన్టీఆర్‌తో సినిమా ఆపేయ్.. ఆ ప్రొడ్యూసర్‌కు రజనీకాంత్ వార్నింగ్, రిలీజ్ చేస్తే!
సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు భారీ విజయాలు సాధిస్తే.. మరికొన్ని అనూహ్యమైన ఫలితాన్ని అందిస్తాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయితే.. ఏమాత్రం బజ్ లేకుండా విడుదలయ్యే సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సందర్భాలు కోకొల్లలు. అనుభవం లేనివారి సంగతి పక్కనపెడితే.. సీనియర్ దర్శక నిర్మాతలు కూడా బొక్క బొర్లా పడుతుంటారు. ఏకంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పినా వినకుండా ఓ సినిమా తీసిన ప్రొడ్యూసర్ కోట్లలో నష్టం తెచ్చుకున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ ప్రొడ్యూసర్లలో చలసాని అశ్వినీదత్ ఒకరు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ఎన్నో హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అన్నగారు, నటరత్న ఎన్టీఆర్ చేతుల మీదుగా ఊపిరి పోసుకున్న వైజయంతి మూవీస్ దాదాపు 50 ఏళ్లుగా తన ప్రస్థానాన్ని విజయవంతంగా సాగిస్తోంది. ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమాతో మరోసారి వైజయంతి మూవీస్ పేరు దేశమంతా మారుమోగింది.

1975లో ఎన్టీఆర్‌తో ఎదురులేని మనిషితో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన అశ్వినీదత్.. యుగపురుషుడు, జమదగ్ని, ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోకసుందరి, గోవిందా గోవిందా, ఇంద్ర, చిరుత, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలను నిర్మించారు. అలాగే మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్, నారా రోహిత్ వంటి హీరోలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు అశ్వినీదత్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అశ్వినీదత్ పలు సినిమాలు తీశారు.
సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న అశ్వినీదత్ కెరీర్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో తీసిన శక్తి చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో దాదాపు రూ. 48 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 2011 ఏప్రిల్ 1న విడుదలై భారీ నష్టాలను మిగిల్చింది. శక్తి సినిమా దెబ్బకు అశ్వినీదత్ కోలుకోలేకపోయారు. దాదాపు 7 , 8 ఏళ్లు ఆయన సినీ నిర్మాణానికి దూరమయ్యారు. ఈ సినిమా గురించి అశ్వినీదత్ పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిజానికి జాతకాలను ఎక్కువగా నమ్మే అశ్వినీదత్‌కు ఆయన సన్నిహితుడైన జ్యోతిష్యుడు 2010 ప్రాంతంలో నీకు ఏలిన్నాటి శని మొదలు కాబోతోందని.. ఏడున్నరేళ్ల పాటు ఏ సినిమా తీయొద్దని సూచించారట. అయితే అన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండటం కెరీర్ పరంగా మంచిది కాదని దత్ మనసులో అనుకున్నారట. జ్యోతిష్యుడి మాటను పట్టించుకోకుండా వెంటనే ఎన్టీఆర్ - మెహర్ రమేశ్ కాంబోలో శక్తి చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లారు. షూటింగ్ మధ్యలో ఉండగా ఓ రోజున తన బెస్ట్ ఫ్రెండ్, సూపర్‌స్టార్ రజనీకాంత్ దగ్గరికి వెళ్లారట అశ్వినీదత్.
మాటల సందర్భంలో శక్తి సినిమా తీస్తున్నానని, ఇందులో శక్తి పీఠాల బ్యాక్‌డ్రాప్ ఉంటుందని రజనీతో చెప్పారట. అయితే అమ్మవారి కథాంశంతో సినిమా వద్దని వెంటనే శక్తి సినిమాను ఆపేయమని అశ్వినీదత్‌ను రజనీ హెచ్చరించారట. అయితే అప్పటికే సగభాగం షూటింగ్ కంప్లీట్ కావడంతో వెనక్కి తగ్గలేనని రజనీకి చెప్పిన అశ్వినీదత్ అలాగే మొండిగా శక్తి సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేయగా దాదాపు రూ.25 కోట్ల నష్టం వాటిల్లిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











