Mahesh babu రియల్ శ్రీమంతుడు : బుర్రిపాలెంలో పూర్తయిన వ్యాక్సిన్ డ్రైవ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడినే అనిపించుకుంటున్నారు. ఇప్పటికే ఆయన కొన్ని వందల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ ప్రాణాలు నిలుపుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెం దత్తత తీసుకుని ఆయన ఒక సొంత కుటుంబ సభ్యుడిలా ఆ ఊరు మొత్తాన్ని ప్రతి అంశంలోనూ ముందుండి నడిపిస్తున్నారు.
తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కరోనా వ్యాధి సోకకుండా తన సొంత గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం మహేష్ ప్రారంభించారు. విజయవాడకు చెందిన ఆంధ్ర హాస్పిటల్స్ సౌజన్యంతో వారం రోజుల పాటు ఊరి ప్రజలు అందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. బుర్రిపాలెం గ్రామంలో మొత్తం 12 వార్డులు ఉండగా ప్రజలందరికీ ఒకేసారి వ్యాక్సిన్ ఇవ్వడం కుదిరే పని కాదు కాబట్టి రోజుకు రెండు వార్డులు చొప్పున మొత్తం 12 వార్డుల ప్రజలకు ఈ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.

మహేష్ బాబు ఫౌండేషన్ తరఫున ఈ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మొత్తం జరిగింది. బుర్రిపాలెంలో ఉన్న దాదాపు ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ పూర్తి కాగా వారందరూ మహేష్ బాబుకు ధన్యవాదాలు చెబుతున్న వీడియోలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభించాల్సి ఉంది. దీనికి ఇంకా టైటిల్ అలాగే ఇతర వివరాలు వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications











