సుశాంత్ సింగ్‌ డెత్ మిస్టరీ.. హత్యా? ఆత్మహత్యా? సీబీఐ ఏం తేల్చిందంటే?

భారతీయ సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలుగొందాలని సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఎందరో వర్ధమాన తారలు తమ కల నెరవేరకుండానే మధ్యలోనే తమ ప్రస్థానాన్ని ముగిస్తున్నారు. అవకాశాలు రాకపోవడం, వ్యక్తిగత సమస్యలు, డిప్రెషన్, ఈర్ష్య, అసూయలు వారిని చుట్టుముడుతున్నాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో నాటి నుంచి నేటి వరకు ఎందరో తారలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈ మరణాల్లో కొన్ని నేటికీ అనుమానాస్పద మరణాలుగానే మిగిలి మిస్టరీగా మారిపోయాయి. ఏళ్లుగా వీటిని ఛేదించేందుకు ఎంతోమంది ప్రయత్నిస్తున్నా.. సమాధానం మాత్రం దొరకడం లేదు. ఈ కోవలోకే వస్తుంది బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం. ఆయనది ఆత్మహత్య అని కొందరు.. కాదు హత్య అని కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో అసలు ఏం జరిగింది? సుశాంత్ మరణంపై భారత అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ ఏం తేల్చింది? ఈ వివరాల్లోకి వెళితే..

బీహార్‌లోని పాట్నాలో 21 జనవరి 1986న జన్మించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తొలుత బుల్లితెరపై అడుగుపెట్టారు. కిస్ దేశ్ మై హై మేరా దిల్ సీరియల్‌తో హిందీ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆయనకు పవిత్ర రిస్తా సీరియల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. సుశాంత్ పోషించిన మానవ్ దేశ్‌ముఖ్ పాత్రకు మహిళా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే ఆయనకు సినిమాలలో అవకాశాలు వెల్లువెత్తాయి. 2013లో కై పో చే అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు సుశాంత్.

Sushant Singh Rajput Death Mystery What CBI Finally Reveal Truth Behind Actor s suspicious Death

శుద్ధ్ దేశి రొమన్స్, పీకే, డిటెక్ట్ బ్యోమకేష్ బక్షీ తదితర సినిమాలలో నటించారు. ఈ దశలో భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా వచ్చిన ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ మూవీలో ధోనీ పాత్రను పోషించాడు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో సుశాంత్‌కు స్టార్ ఇమేజ్ దక్కింది. ఆ వెంటనే కేదార్‌నాథ్, సోన్‌చిరియా, చిచ్చోరేలతో వరుస విజయాలు అందుకుని బాలీవుడ్ లీడింగ్ హీరోలలో ఒకరిగా నిలిచాడు. తదుపరి సూపర్‌స్టార్‌గా ఎదుగుతున్న క్రమంలో అనూహ్యంగా 2020 జూన్ 14న ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు. సుశాంత్ మరణవార్త భారతీయ చిత్ర పరిశ్రమను, ఆయన అభిమానులను ఉలిక్కిపడేలా చేసింది.

వెంటనే రంగంలోకి దిగిన ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలీవుడ్‌కు చెందిన కొందరు పెద్దలు సుశాంత్‌కు అవకాశాలు రాకుండా చేశారని, పెద్ద హిట్స్ ఇచ్చినా తనకు అవకాశాలు దక్కకపోవడంతో సుశాంత్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని అతని సన్నిహితులు కొందరు ఆరోపించారు. దాంతో బాలీవుడ్‌లో నెపోటిజం, కొత్త నటీనటులు ఎదుర్కొనే ఇబ్బందులపై చర్చ జరిగింది. అయితే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని సుశాంత్ తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రధానంగా సుశాంత్ ప్రియురాలు, బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై ఆయన తండ్రి కేకే సింగ్ చేసిన ఆరోపణలు సంచలన సృష్టించాయి. సుశాంత్ అకౌంట్ నుంచి రియా 15 కోట్ల రూపాయలు బదిలీ చేసుకుందని ఆయన ఆరోపించారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. ఆపై మాదక ద్రవ్యాల అంశం తెరమీదకి రావడంతో సుశాంత్ కేసు అనేక చిక్కుముడుల్లో చిక్కుకుంది. చివరికి నిజానిజాలు తేల్చేందుకు గాను సుశాంత్ ఆత్మహత్య కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.

ఈ కేసులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిలను సీబీఐ, ఈడీ ప్రశ్నించగా కోర్ట్ రిమాండ్ విధించడంతో వీరిద్దరూ కొన్నాళ్లు జైలులో కూడా ఉన్నారు. జైలు నుంచి విడుదలైనా విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు గాను రియా, షోవిక్, వీరి తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిలు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అలాగే డ్రగ్స్ కోణంలో రియాను అరెస్ట్ చేసినప్పుడు ఆమెకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సీజ్ చేసింది. సీబీఐ జారీ చేసిన లుకౌట్ నోటీసులపై రియా కుటుంబం బాంబే హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం కూడా బాంబే హైకోర్టును సమర్ధించింది.

ఈ పరిణామాలతో సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. అన్ని కోణాల్లోనూ విచారణ జరిపింది. రియా కుటుంబ సభ్యులతో పాటు సుశాంత్ తల్లిదండ్రులు, అతని సన్నిహితులు, సినీ ప్రముఖులు, అపార్ట్‌మెంట్ వాసులు అందరినీ విచారించింది. దాదాపు ఐదేళ్ల పాటు విచారణ జరగ్గా మార్చి 22, 2025న సీబీఐ తన తుది నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది. ఇందులో సుశాంత్ ఆత్మహత్య కారణంగానే చనిపోయాడని తేల్చింది. సుశాంత్ మరణం వెనుక కుట్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని, అలాగే రియాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు సీబీఐ క్లీన్‌చీట్ ఇచ్చింది.

సుశాంత్‌పై విష ప్రయోగం, గొంతుపై గాయాలు ఇతరత్రా ఆరోపణలపై ఎయిమ్స్ ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా సీబీఐ ఈ నిర్ణయానికి వచ్చి కేసును క్లోజ్ చేసింది. దాంతో సుశాంత్ మరణం చుట్టూ నెలకొన్న అనుమానాలకు, ఆరోపణలకు చెక్ పడినట్లయ్యింది. ఏది ఏమైనా బాలీవుడ్‌కు బావి సూపర్‌స్టార్ అవుతాడనుకున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేవలం 34 ఏళ్ల చిన్న వయసులోనే తన ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించి కోట్లాది మంది అభిమానులను తీరని విషాదంలో ముంచాడు. అయితే తన సినిమాల ద్వారా సుశాంత్ ఎప్పటికీ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X