నిర్మాతగా మెగాస్టార్ కూతురు.. వెబ్ సిరీస్ నిర్మాణంలోకి సుస్మిత
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీలో నుంచి మరొకరు సినీ నిర్మాణంలోకి ప్రవేశించారు. ఇప్పటి వరకు చిరంజీవి సినిమాలతోపాటు పలు సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేసిన కొణిదెల సుస్మిత ఇప్పుడు వెబ్ సిరీస్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ వెబ్ సిరీస్ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సుస్మిత తల్లి, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ హాజరయ్యారు.
ఇంకా పేరు పెట్టని వెబ్ సిరీస్‌ను జీ5 కోసం రూపొందిస్తున్నారు. ఇటీవల జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పోలీస్, క్రిమినల్ నేపథ్యంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రానికి దర్శకుడిగా ఆనంద్ రంగా పరిచయం అవుతున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కొణిదెల సుస్మిత, విష్ణు ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, సంపత్ రాజ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.
పూజా కార్యక్రమాల సందర్భంగా సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారావెబ్ సిరీస్‌ను అందిస్తున్నామని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. జీ5 కోసం ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నాం. ఓయ్ ఫేం ఆనంద్ రంగ దర్శకత్వం వహిస్తున్నారు అని అన్నారు.

సినీ నిర్మాణంలోకి ప్రవేశించిన సుస్మిత కొణిదెలకు కుటుంబ సభ్యులతోపాటు పలువురు సినీ ప్రముఖులు విషెస్ అందజేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ పూర్తిస్థాయి షూటింగు జరుపుకొంటుందని, లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ చేసేలా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకొంటున్నది.

సుస్మిత కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల రూపొందిన సైరా నర్సింహరెడ్డి చిత్రానికి క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. అంతకు ముందు పలు చిరంజీవి, రాంచరణ్ చిత్రాలకు కూడా డిజైనర్‌గా సేవలు అందించారు.


Click it and Unblock the Notifications











