చిరంజీవి ఆఫర్‌తో నా రాత మారింది.. ఆ డైలాగ్‌తో జీవితం ధన్యమైంది.. సాయి మాధవ్ బుర్రా
సైరా మూవీ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ సందర్బంగా హాజరైన మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సముద్రం లేదని ఎవరన్నారు. సముద్రాన్ని సైరా వేడుకకు హాజరైన జన సముద్రం తలపిస్తున్నది. మెగాస్టార్ ఒక పిలుపు ఇస్తే వసంతాలే కాదు.. సముద్రాలు తరలివస్తాయి. మా అమ్మమ్మకు సినిమా పిచ్చి. 80 దశకంలో హీరోలు ఎవరూ ఆమెకు తెలియదు. కానీ చిరంజీవి మాత్రం చాలా ఇష్టం. చిరంజీవి నటించిన ఖైదీ పాట చాలా ఇష్టపడేవారు. టేప్ రికార్డులో ఎప్పుడూ వింటుండే వారు. ఆ పాటలో దిద్దినక ధింతా అని వస్తూంటే తెగ సంబరపడిపోయేవారు అని మాటల రచయిత బుర్ర సాయి మాధవ్ అన్నారు.

మెగా ఈవెంట్‌కు ఆహ్వానం
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఫంక్షన్‌కు ఇన్విటేషన్ ఇచ్చి రమ్మని అన్నారు. శిల్పకళావేదిక వద్దకు చేరుకోవడంలో ఆలస్యమైంది. కిక్కిరిసిన జనం ఉండి లోపలికి వెళ్లలేకపోయాను. అంతలోనే నాగబాబు ఫోన్ చేసి లోపలికి తీసుకెళ్తానన్నారు. కానీ నాకు చిరంజీవి పాల్గొనే ఈవెంట్‌కు ఇన్విటేషన్ వచ్చింది. అది చాలూ అన్నాను.

ఆ అమ్మమ్మ చిరంజీవి ఫ్యాన్
ఇక మా అమ్మమ్మ ఎప్పుడూ చిరంజీవి సినిమాకు కథ రాయమని, మాటలు రాయమని చెబుతుండేది. అయితే అప్పుడు నేను కృష్ణానగర్‌లో అవకాశాల కోసం తిరిగే సమయం కావడంతో చిరంజీవికి కథ రాయడమంటే మాములు విషయం కాదు. ఆయన సినిమాకు మాటలు రాయడమంటే ఆకాశాన్ని అందుకోవడం లాంటిది అని నచ్చచెప్పాను.

ఒక్క డైలాగ్ రాసినా జీవితం ధన్యం
అలాంటి నాలాంటి వ్యక్తికి ఖైదీ నంబర్ 150 సినిమాకు మాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో రచయిత వేమారెడ్డితో కలిసి పనిచేయమని అంటే.. మీ సినిమా కోసం ఒక్క డైలాగ్ రాసిన నా జీవితం ధన్యమైనట్టే అని అన్నాను. ఆ అవకాశం నాకు కెరీర్‌ను మార్చేసింది. అందుకు నేను రుణపడి ఉంటాను అని సాయి మాధవ్ పేర్కొన్నారు.

ఖైదీ నంబర్ 150లో ఆ డైలాగ్
అవకాశం వచ్చిందే తడవుగా చిరంజీవి స్థాయికి మాటలు రాయాలని ఆలోచించాను. ఆ రేంజ్ తగ్గకుండా ఉండాలి.. మెగాస్టార్‌ను మెప్పించాలనుకొన్నాను. ఆ క్రమంలో పొగరు ఒంట్లో ఉంటుంది. హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది అనే డైలాగ్‌ను ఖైదీ నంబర్ 150 చిత్రంలో రాశాను అని మాటల రచయిత సాయి మాధవ్ ఉద్వేగంతో చెప్పారు.


Click it and Unblock the Notifications











