‘సైరా’ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించిన రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచింది. ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆగస్టు 20న టీజర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ రామ్ చరణ్ తన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు.
సైరా టీజర్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ ఉంటుంది. టీజర్ కోసం ఇటీవలే ఆయన డబ్బింగ్ కంప్లీట్ చేశారు. చిరంజీవి దగ్గరుండి తన సోదరుడితో డబ్బింగ్ చెప్పించడం గమనార్హం. ఇందులో పవర్ స్టార్ వాయిస్ ఉంటుందనే వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచింది. 1857 బ్రిటిష్ కాలం నాటి కథ కావడంతో అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా భారీ సెట్స్ వేసి ఈ మూవీ రూపొందించారు. ఈ సెట్ల నిర్మాణం ఎలా జరిగింది అనేది ఈ మేకింగ్ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేశారు.

సైరాలో యాక్షన్ సీన్లు ఒళ్లు గగుర్బొడిచే విధంగా ఉండబోతున్నాయి. యుద్ధ సన్నివేశాల చిత్రీకరించిన విధానం, దాని కోసం చిత్ర బృందం ఎంత కష్టపడిందో ఫోకస్ చేశారు. సినిమాలోని పోరాట సన్నివేశాలు బాహుబలి రేంజిలో ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, నయనతార, తమన్నా పాత్రలను పరిచయం చేశారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్, అమితాబ్ బచ్చన్ కలిసిన సీన్ కూడా ఇందులో పొందు పరచడం గమనార్హం.


Click it and Unblock the Notifications











