28 ఏళ్ల తర్వాత హిట్ జోడి రిపీట్.. నాగార్జునతో టాప్ హీరోయిన్..
తెలుగు సినీ పరిశ్రమలో మైలురాయి సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకత ఉంటుంది. ఒక స్టార్ హీరో కెరీర్‌లో 100వ సినిమా అంటే అభిమానులకు మాత్రమే కాదు, ఇండస్ట్రీ మొత్తానికి కూడా అది ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా మారుతుంది. ఇప్పుడు అలాంటి అరుదైన ఘట్టానికి దగ్గరలో ఉన్నారు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). ఆయన కెరీర్‌లో 100వ సినిమాగా రూపొందుతున్న 'కింగ్ 100' ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ ఆసక్తిని మరింత పెంచేలా మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఇంతకీ ఆ స్పెషల్ అప్డేట్ ఏంటీ?
ఇప్పటి వరకు 'కింగ్ 100' సినిమా గురించి చిత్రబృందం అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పూర్తి గోప్యతతో షూటింగ్ కొనసాగిస్తోంది. 'కింగ్ 100' అనే వర్కింగ్ టైటిల్‌తో గతేడాది ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ను సైలెంట్‌గా తెరకెక్కిస్తున్నారు. సెట్స్ నుంచి ఎలాంటి లుక్స్, పోస్టర్లు, క్యాస్టింగ్ వివరాలు బయటకు రానీయకుండా జాగ్రత్త పడుతున్నారు. అలాంటి సమయంలో అలనాటి టాప్ హీరోయిన్ టబు ఈ సినిమా గురించి కీలక ప్రకటన చేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

టబు సోషల్ మీడియా వేదికగా మూవీ క్లాప్‌బోర్డ్ ఫోటోను షేర్ చేసింది. దీంతో ఆమె నాగార్జున 100 వ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక తెలియజేసినట్టు అయింది. టబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్లాప్‌బోర్డ్‌పై #King100 అని ఉన్న ఫోటోను పోస్ట్ చేసి, అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios)ను ట్యాగ్ చేయడం, నాగార్జున పేరుతో హ్యాష్‌ట్యాగ్ జోడించడం విశేషం. దీంతో ఈ సినిమాలో ఆమె భాగమవుతున్నారనే విషయం దాదాపు ఖరారైంది. చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయకపోయినా, టబు పోస్టే ఇప్పుడు అభిమానులకు పెద్ద అప్డేట్‌గా మారింది.
ఈ పోస్టుపై దర్శకుడు రా. కార్తీక్ స్పందిస్తూ.. 'మేడమ్.. మీతో కలిసి పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని కామెంట్ చేయడం మరింత ఆసక్తి పెంచింది. అక్కినేని హీరో సుశాంత్ కూడా ఈ పోస్టుపై స్పందించి తన ఆనందాన్ని పంచుకున్నారు. దీంతో ఈ కాంబినేషన్‌పై ఇండస్ట్రీలో సానుకూల చర్చ మొదలైంది.
నాగార్జున - టబు జోడీకి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన నిన్నే పెళ్లాడుతా సినిమా ఘన విజయం సాధించి క్లాసిక్‌గా నిలిచింది. ప్రేమకథా చిత్రాల్లో ఆ మూవీకి ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఆవిడా మా ఆడివే లోనూ ఇద్దరూ కలిసి నటించారు. అంతకుముందు సిసింద్రీలో టబు ప్రత్యేకంగా కనిపించారు. ఇలా ఒకప్పుడు స్క్రీన్‌పై మెరిసిన ఈ జోడీ, దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటించబోతుండటం విశేషంగా మారింది.
ఒకప్పుడు నాగ్-టబు ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ యువతను ఎంతగానో ఆకట్టుకుంది. క్లాస్, గ్లామర్, మెచ్యూర్ రొమాన్స్ కలగలిపిన జంటగా వీరిద్దరికీ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అందుకే ఇప్పుడు మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతుందనే వార్త అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. అయితే ఈ సినిమాలో టబు నాగార్జున సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారా? లేక కీలకమైన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారా? అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
ఇక ఈ సినిమాలో టబుతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఐశ్వర్య రాజేశ్ పేరు బయటకు వచ్చింది. మరో హీరోయిన్‌గా సుష్మిత భట్ పేరు వినిపిస్తోంది. ముగ్గురు హీరోయిన్లతో కథను విభిన్న కోణాల్లో నడిపించేలా దర్శకుడు ప్లాన్ చేసినట్లు సమాచారం. మొత్తం మీద 'కింగ్ 100' సినిమా ఇప్పుడు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. నాగార్జున మైలురాయి చిత్రం, టబు రీఎంట్రీ కాంబో, ముగ్గురు హీరోయిన్లు, దేవిశ్రీ సంగీతం, కొత్త దర్శకుడి విజన్.. ఇలా అన్ని అంశాలు కలిసొచ్చాయి. ఇక ఈ జోడీ మరోసారి బాక్సాఫీస్‌పై మ్యాజిక్ చేస్తుందా? లేక కేవలం నోస్టాల్జియా వరకే పరిమితమవుతుందా? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications