Hanuman Censor Review హనుమాన్‌పై సెన్సార్ రియాక్షన్ ఏమిటి? రన్‌టైమ్ ఎంతంటే?
తేజ సజ్జ.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలనటుడిగా సినీ రంగంలో అడుగు పెట్టి.. చిన్నప్పుడే అదిరిపోయే నటన, డైలాగ్స్ తో రచ్చ చేసిన ఈ బుడతడు ఇప్పుడు హీరోగా మారిపోయాడు. విభిన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ సినీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. ముఖ్యంగా 1998లో చూడాలని ఉంది సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో కాలు మోపిన ఈయన.. పాతిక చిత్రాలకు పైగా సినిమాల్లో చిన్నప్పుడే నటించాడు. పెద్దయ్యాక 2019లో ఓ బేబీ సినిమా ద్వారా తెరపై మెరిశాడు.
ఇక ఆ తర్వాత నుంచి అద్భుతమైన కథలను ఎంచుకుంటూ హీరోగా ఇరగదీస్తున్నాడు. జాంబీ రెడ్డి, ఇష్క్, అద్భుతం వంటి చిత్రాల్లో కనిపించాడు. ప్రస్తుతం ఈ కుర్ర హీరో హను మాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా హీరోగా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో తేజ సజ్జాతో పాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అలాగే వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీనులు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారు. విజ్యువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ లు సంగీతం అందిస్తుండగా... శివేంద్ర సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అలాగే ఎస్. బి రాజు తలారి ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం మూడు పాటలు ఉండగా.. అందులో ఒకటి హనుమాన్ చాలీసా, సూపర్ హీరో హనుమాన్, ఆవకాయ అంజనేయ పాటలు అందరినీ అలరించనున్నాయి.
ఇటీవలే విడుదల చేసిన హనుమాన్ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. విజ్యువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. జనవరి 12వ తేదీన తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసేందుకు మూవీ టీం ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది.

తేజ సజ్జా హీరోగా రాబోతున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ ను జారీ చేసింది. అలాగే సినిమా రన్ టైమ్ ను కూడా ఫిక్స్ చేసింది. రెండు గంటల 38 నిమిషాలుగా సినిమా రన్ టైమ్ ను లాక్ చేసింది. సెన్సార్ పూర్తి చేసుకోవడంతో అంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు. చూడాలి మరి జనవరి 12వ రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కాబోతుంది, ఎంతమేర కలెక్షన్లను వసూలు చేయబోతుందో.


Click it and Unblock the Notifications











