అల్లు అర్జున్ కాలు పోయిందా, కన్ను పోయిందా .. టాలీవుడ్‌పై శివాలెత్తిన రేవంత్ రెడ్డి
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలై అన్ని రికార్డుల దుమ్ము దులిపేస్తోంది. రెండు వారాల్లోనే దాదాపు రూ.1400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారతీయ చిత్ర పరిశ్రమలోనే సరికొత్త బెంచ్ మార్క్‌లు సృష్టిస్తోంది. ఇప్పటికే జవాన్, స్త్రీ 2, ఆర్ఆర్ఆర్ రికార్డులను అధిగమించిన ఈ సినిమా.. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో 3వ స్థానంలో నిలిచింది. అయితే రికార్డులే కాదు.. ఈ సినిమాపై వివాదాలు అదే స్థాయిలో ఉన్నాయి.
పుష్ప 2 విడుదలకు ముందు హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె బిడ్డ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. దీనికి సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఏకంగా అల్లు అర్జున్‌నే అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా.. చంచల్‌గూడ జైలులో ఒక రాత్రంతా ఉండి బయటికొచ్చారు అల్లు అర్జున్.

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానని.. కోర్టులో విచారణ నడుస్తున్న నేపథ్యంలో ఆసుపత్రిలో బాబుని పరామర్శించలేకపోతున్నట్లు అల్లు అర్జున్ మీడియాకు తెలిపారు. అయితే ఆయన తండ్రి , నిర్మాత అల్లు అరవింద్ మాత్రం ఆసుపత్రిలో చిన్నారిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇదే సమయంలో చిన్నారి ఆరోగ్యం మరింత విషమించినట్లుగా కొద్దిరోజుల క్రితం వార్తలు రావడంతో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.
అల్లు అర్జున్ కారణంగానే తొక్కిసలాట జరిగిందని చెబుతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారణ జరుగుతుందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభ్యుల విజ్ఞప్తి మేరకు సంధ్య థియేటర్ ఇష్యూపై ప్రకటన చేశారు. సంధ్య థియేటర్ వద్ద తాము సెక్యూరిటీ కల్పించలేమని పోలీసులు ముందే హెచ్చరించినా అల్లు అర్జున్ వచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు. ఎలాంటి హడావుడి చేయకుండా సినిమా చూసి వెళ్లిపోతే ఏ గొడవ ఉండేది కాదని.. కానీ అల్లు అర్జున్ తన కారులోని రూఫ్ టాప్ నుంచి అభిమానులకు అభివాదం చేస్తూ లోపలికి వచ్చారని రేవంత్ అన్నారు.
దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున లోపలికి వచ్చారని.. హీరో కారును లోపలికి పంపించేందుకు గేటు తెరవగా వందలాది మంది అభిమానులు లోపలికి దూసుకొచ్చి పరిస్ధితి అదుపు తప్పిందని సీఎం పేర్కొన్నారు. దీంతో ఏసీపీ స్వయంగా అల్లు అర్జున్ వద్దకు వెళ్లి తిరిగి వెళ్లిపోవాలని చెప్పారని, కానీ హీరో మాత్రం వినిపించుకోలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చివరికి అరెస్ట్ చేస్తామని చెప్పడంతో అల్లు అర్జున్ అక్కడి నుంచి కదిలారని, వెళ్లేటప్పుడు కూడా చేతులు ఊపుతూ రోడ్ షో చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాన్ని, ఆమె బిడ్డను హీరో పరామర్శించలేదని.. అలాంటి మానవత్వం లేనివాళ్లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళితే ప్రభుత్వంపై కొందరు విమర్శలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ కాలు పోయిందా, కన్ను పోయిందా ఎందుకు ఆయనను పరామర్శిస్తున్నారని సీఎం మండిపడ్డారు. వాళ్లలో ఒక్కరు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని ముఖ్యమంత్రి తెలిపారు. వ్యాపారాలు చేసుకోవడానికి మేం అడ్డురాం.. కానీ ప్రాణాలతో చెలగాటం ఆడితే ఒప్పుకోమని సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు వార్నింగ్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











