అఖండ 2 మూవీకి తెలంగాణ సర్కార్ షాక్.. టికెట్ రేట్ల పెంపుపై...
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల కాంబోలో తెరకెక్కిన అఖండ 2 సినిమాపై చిత్ర సీమలో భారీ అంచనాలున్నాయి. గతంలో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కించారు. బాలయ్య - బోయపాటిల కాంబోలో వస్తున్న నాలుగో చిత్రమిది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లతో అఖండ 2పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 5వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, అవధ్ భాషల్లో అఖండ 2 చిత్రం విడుదల కానుంది.
అఖండ 2 తారాగణం
14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనాలు సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలయ్య చిన్న కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరించారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా, కబీర్ దుహన్ సింగ్, స్వస్త ఛటర్జీ, రాన్‌సన్ విన్సెంట్, అచ్యుత్ కుమార్, సంగే షెల్ట్రిమ్, రవి మరియా, విక్రమ్‌జిత్, పూర్ణ, సాయికుమార్, హర్ష చెముడు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందిస్తుండగా... తమ్మిరాజు ఎడిటింగ్, సీ. రాంప్రసాద్, సంతోష్ దేట్కేలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు.

అఖండ 2 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో అఖండ 2 చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
ఏపీలో అఖండ 2 టికెట్ ధరలు పెంపు
అన్ని పెద్ద సినిమాల మాదిరిగానే అఖండ 2 టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం.. సింగిల్ స్క్రీన్‌లలో 75 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 100 రూపాయలు పెంచుకోవచ్చు. రోజుకు ఐదు షోలతో పాటు దాదాపు 10 రోజుల పాటు పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి. అలాగే రిలీజ్‌కు ముందు రోజు రాత్రి (డిసెంబర్ 4) 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్ షో ప్రదర్శించడానికి కూడా ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఈ ప్రీమియర్ షో ధరను 600గా నిర్ణయించారు. అలా ప్రకటించడమే ఆలస్యం ప్రీమియర్స్ టికెట్ల కోసం నందమూరి అభిమానులు ఎగబడుతున్నారు.
టికెట్ ధరల పెంపుపై అభ్యంతరాలు
అయితే టికెట్ రేట్ల పెంపుపై పలువురు ఖండిస్తున్నారు. ఇప్పటికే సీపీఐ నారాయణ వంటి నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రభుత్వాలే ఐబొమ్మ రవిలాంటి వ్యక్తులను సృష్టిస్తున్నాయని.. ప్రజలను సినిమాకు దూరం చేస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం అఖండ 2 టికెట్ ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకోగా.. తెలంగాణ సర్కార్ మాత్రం షాకిచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు కూడా ఉన్నాయి.
అఖండ 2 యూనిట్‌కు తెలంగాణ సర్కార్ షాక్
పుష్ప 2 సమయంలో జరిగిన తొక్కిసలాటతో పాటు పలు సినిమాల విడుదల సమయంలో కోర్టుల వరకు విషయం వెళ్లడం, న్యాయస్థానాల చేతిలో చీవాట్లు వంటి పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పటికీ పలు పిటిషన్లు కోర్టులలో విచారణలో ఉన్నాయి. దాంతో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగకుండా నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టికెట్ ధరలు పెంపుతో పాటు ప్రీమియర్ షోలకు అనుమతి కోరుతూ అఖండ 2 నిర్మాతలు చేసిన అభ్యర్ధనను తెలంగాణ సర్కార్ ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టింది. సోషల్ మీడియాలో అయితే రాష్ట్రంలో అఖండ 2 టికెట్ ధరల పెంపు లేదని వార్తలు వస్తున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం అఖండ 2 సినిమా టికెట్ ధరలను పెంచుతుందో? లేదో? తెలియాలంటే కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











