టికెట్ ధరల పెంపుపై కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ .. థియేటర్లన్నీ మీకేనా , అల్లు అరవింద్ ముందే
తెలుగు చిత్ర పరిశ్రమ అనకాదు.. మొత్తంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలదే రాజ్యం. కథ, కథనం బాగుండి.. జనం ఆదరిస్తున్నా సరే .. పెద్ద సినిమా వస్తే నిర్ధాక్షిణ్యంగా చిన్న సినిమాను తొక్కేస్తారు. దీనిపై ఎందరో చిన్న నిర్మాతలు గళమెత్తారు, సాయం కోసం చూశారు కానీ నో ఛేంజ్. చిన్న సినిమా , పెద్ద సినిమా వంటివేవీ ఉండవని అదంతా స్టార్‌డమ్, కలెక్షన్స్‌లో కనిపించే తేడా మాత్రమేనని మరికొందరు అంటారు. తాజాగా చిన్న సినిమా, పెద్ద సినిమా మధ్య తేడాలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సంక్రాంతి నుంచి నేటి వరకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన పెద్ద సినిమాలు చాలా తక్కువ. ఇప్పటికీ థియేటర్ మెయింటెనెన్స్‌కు డబ్బులు వస్తున్నాయంటే అది చిన్న సినిమా వల్లే. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. అందుకే చిన్న సినిమాను బతికించాలని టాలీవుడ్ పెద్దలు, సీనియర్లు కూడా అంటూ ఉంటారు. చిన్న సినిమాలుగా విడుదలైన బలగం ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెద్ద సినిమాలు కూడా తీసుకురాని లాభాలతో దిల్‌రాజు కంపెనీని ఒడ్డున పడేసింది బలగం.

ఇక రీసెంట్‌గా ఆగస్ట్ 15కి ముందు, ఆ వెనుక టాలీవుడ్‌లో పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. కానీ వాటిని ప్రేక్షకులు తిరస్కరించారు. అయితే ఆయ్, కమిటీ కుర్రాళ్లు వంటి చిన్న సినిమాలను జనం ఆదరించారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని ప్రేక్షకులు కర్రు కాల్చి వాత పెడుతున్నా సినీ పెద్దలు మారడం లేదు. అలాగని చిన్న సినిమాలకు దక్కాల్సిన స్థాయిలో థియేటర్లు అందనివ్వడం లేదనే వాదనలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిన్న సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ యాజమాన్యంలోని ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫాం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కోమటిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్న సినిమాలకు తెలంగాణ ప్రభుత్వ మద్ధతు సంపూర్ణంగా ఉంటుందని హామీ ఇచ్చారు. పెద్ద సినిమాలు తీసినప్పుడు థియేటర్స్ మొత్తం వాళ్లకే దొరుకుతాయని, చిన్న సినిమా వాళ్లకు థియేటర్స్ ఉండవని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇద్దరు ముగ్గురు నిర్మాతలు తనను కలిసి భారీ బడ్జెట్‌తో తీశాం.. మాకు టికెట్ రేట్స్ పెంచాలని అడిగారని తెలిపారు.

దీంతో తాను పెద్ద బడ్జెట్‌తో సినిమా తీసి.. మీరు మళ్లీ టికెట్ రేట్స్ పెంచాలని నా దగ్గరికి రావడమేంటని ప్రశ్నించినట్లు మంత్రి చెప్పారు. సినిమా అనేది మధ్య తరగతి ప్రజలకు ఒక వినోద సాధనమని, వారిపై భారం పడుతుందని, మీరే చిన్న సినిమాలు ఎందుకు తీయకూడదని కోమటిరెట్టి అన్నారు. చిన్ని సినిమాలు తీసి ఆహాలో పెడితే .. ఖచ్చితంగా తక్కువ టైంలో ఎక్కువ మందిని చేరుకుంటుందని మంత్రి సూచించారు.
అల్లు అరవింద్ చిన్న సినిమాతోనే అద్భుతం సృష్టించారని , సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో కలిపి ఒక సినిమా తీయాలని ఉందనే ప్లాన్ ఉందని ఆయన తనతో చెప్పారని మంత్రి చెప్పారు. చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వ మద్ధతు ఎప్పుడూ ఉంటుందని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యమంత్రి ఒక టీం లాగా పనిచేస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఎప్పుడైనా ఎలాంటి సంకోచం లేకుండా తనను కలవొచ్చని.. కొత్త దర్శకులను అల్లు అరవింద్ ప్రోత్సహించాలని మంత్రి కోరారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ డిస్కషన్‌కు దారి తీశాయి.


Click it and Unblock the Notifications











