CCL 2023: బ్యాటింగ్ తో దుమ్ములేపిన అఖిల్.. రాణించిన అశ్విన్.. బైంగాల్ పై ఘన విజయం
యంగ్ జనరేషన్ కు, ప్రేక్షకులు మోస్ట్ ఎంటర్టైనింగ్ గా ఫీల్ అయ్యే అంశాలు ఒకటి సినిమా అయితే మరొకటి క్రికెట్. అభిమాన హీరోల సినిమాలను ఎంత పిచ్చిగా చూస్తారో ఫేవరెట్ క్రికెటర్ గేమ్ ను కూడా గ్రౌండ్ లో చూస్తూ ఆస్వాదిస్తారు. మరి అదే మన అభిమాన హీరోలు బ్యాట్స్, బాల్స్ పట్టుకుని మైదానంలో అదరగొడితే. అవును.. 2011 సంవత్సరం నుంచి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) పేరుతో మనం ఇష్టపడే హీరోలు గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ సూపర్ ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా ఈ ఏడాది కూడా ఈ సీసీఎల్ ప్రారంభమైంది. క్రమంగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో తెలుగు వారియర్స్ రెండో సారి విజయాన్ని అందుకుని సత్తా చాటింది.

వాయిదా పడుతూ..
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (Celebrity Cricket League-CCL)2023లో తెలుగు వారియర్స్ జట్టు సత్తా చాటుతోంది. వరుసగా రెండోసారి విజయాన్ని నమోదు చేసుకుని అదరగొట్టింది. ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమైన ఈ టీ10 లీగ్ మార్చి 19 వరకు జరగనుంది. నిజానికి ఈ 9వ సీసీఎల్ టోర్నమెంట్ 2021లో జరగాల్సింది. కానీ కొవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చి ఈ సంవత్సరం అంటే 2023లో నిర్వహిస్తున్నారు.
సేన్ గుప్తా రాణించడంతో..
ఇదిలా ఉంటే తొలి మ్యాచ్ లో కేరళపై గెలిచినన టాలీవుడ్ జట్టు రెండో మ్యాచ్ లోనూ మంచి ఆటతీరు కనబర్చింది. ఫలితంగా బెంగాల్ టైగర్స్ ను మట్టికరిపించి విజయం సాధించింది. కెప్టెన్ అక్కినేని అఖిల్ మరోసారి తన బ్యాటింగ్ తో సత్తా చాటడంతో బెంగాల్ పై అలవోకగా విజయాన్ని నమోదు చేయగలిగింది. మొదటి ఇన్నింగ్స్ లో బెంగాల్ జట్టు 10 ఓవర్లలో 114 పరుగులు చేసింది. అయితే 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బెంగాల్ టీమ్ జిష్షు సేన్ గుప్తా బాగా రాణించడంతో అత్యధిక స్కోర్ చేయగలిగింది.

26 బంతుల్లో 57 రన్స్..
అనంతరం బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ తమ 10 ఓవర్ల కోటాలో 4 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. దీంతో బెంగాల్ పై 12 పరుగుల ఆధిక్యాన్ని సాధించగలిగింది. ఇక కేరళతో జరిగిన మ్యాచ్ లో 91 (30), 65* (19) పరుగులతో సత్తా చాటిన అక్కినేని అఖిల్.. ఈ టోర్నీలో వరుసగా మూడో ఆఫ్ సెంచరీ చేసి అబ్బురపరిచాడు. 26 బంతుల్లో 57 రన్స్ చేసి ఆశ్చర్యపరిచాడు. అలాగే అశ్విన్ బాబు కూడా 17 బంతుల్లో 43 పరుగులు చేసి రాణించాడు.

అగ్ర స్థానానికి..
రెండో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో బెంగాల్ టైగర్స్ కెప్టెన్ జిష్షు సేన్ గుప్తా 83 రన్స్ చేయడం వల్ల 10 ఓవర్లలో 126 పరుగులు నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 12 పరుగుల ఆధిక్యంలో ఉండటంతో తెలుగు వారియర్స్ విజయానికి 114 పరుగులు అవసరం అయ్యాయి. అశ్విన్ 62 పరుగులతో దుమ్ములేపడంతో.. టాలీవుడ్ టీమ్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 8.2 ఓవర్లలోనే లక్ష్యాన్నిచేధించింది. ఈ విజయంతో సీసీఎల్ 2023 పాయింట్ల పట్టికలో తెలుగు వారియర్స్ టీమ్ అగ్ర స్థానానికి చేరుకుంది.

హైదరాబాద్ లో ఫైనల్స్..
గత ఆదివారం రాయ్ పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కేరళ స్ట్రైకర్స్ పై తెలుగు వారియర్స్ 64 పరుగుల తేడాతో మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా 2011లో ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభమైంది. అయితే 2019 వరకు ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తూ వచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేళ్లపాటు సీసీఎల్ టోర్నీని నిర్వహించడం సాధ్యపడలేదు. ఇక ప్రస్తుతం సీజన్ లో 8 జట్లు పోటీ పడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 19న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications











