Tamilnadu Results: ఆనాడు ఎన్టీఆర్.. నేడు దళపతి విజయ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన రీతిలో ఫలితాలు వెల్లడయ్యాయి. అధికార డీఎంకే పార్టీ విజయం సాధిస్తుందనే ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేస్తూ దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సంచలన విజయం సాధించడం రికార్డుగా మారింది. దిగ్దజ ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను ఎదుర్కొనేందుకు అండర్ డాగ్‌గా రాజకీయ ప్రయాణం చేపట్టిన విజయ్ ఓటర్లను, ప్రజలను ఆకట్టుకోవడం ద్వారా ప్రజా క్షేత్రంలో ఓ నమ్మకాన్ని క్రియేట్ చేసుకొన్నారు. ఇలాంటి చరిత్ర గతంలో సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌లో స్వర్గీయ ఎన్టీఆర్‌కు మాత్రమే సాధ్యమైంది. అయితే ఈ స్టార్ హీరోల పాలిటిక్స్ జర్నీ వివరాల్లోకి వెళితే..
సినీ తారలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఎంజీఆర్, కరుణానిధి, విజయ్ కాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, పవన్ కల్యాణ్, విజయశాంతి లాంటి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి తమ మార్కును ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. వీరందరికి భిన్నంగా నందమూరి తారక రామారావు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతుండగానే.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగు దేశం పార్టీని స్థాపించి ప్రజల్లోకి దూసుకుపోయారు. కేవలం 9 నెలల్లోనే ఆయన అధికారాన్ని చేజిక్కించుకొని తిరుగులేని నేతగా, రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తన ముద్రను చాటుకొన్నారు.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ తరహాలోనే దళపతి విజయ్ కూడా ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతుండగానే.. కెరీర్‌కు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఆయన పార్టీ ప్రారంభించినప్పుడు రకరకాల విమర్శలు, ఆరోపణలు, అడ్డంకులు ఎదుర్కొన్నాడు. తనకు ఎదురైన సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ, కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపాడు. కరూర్ తొక్కిసలాట వివాదంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి విచారణను కూడా బలంగా ఎదుర్కొన్నాడు.
తమిళనాడులో అధికార డీఎంకే పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, అలాగే అన్నాడీఎంకే పార్టీ నాయకత్వ లోపాన్ని చక్కగా తనకు బలంగా మార్చుకొన్నాడు. ముఖ్యంగా యువత, మహిళలను టార్గెట్ చేసుకొని వారిలో విశ్వాసాన్ని కలిగించాడు. దాంతోనే తమిళనాడులో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఓటింగ్ నమోదైంది. దేశ, విదేశాల్లో నుంచి ఓటర్లు సొంత ఖర్చులతో వచ్చి డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారనేది తాజా ఫలితాలు స్పష్టం చేశాయి.
తమిళనాడులో మార్పు కోరుకొన్న ఓటర్లు ఎన్నో ఏళ్లుగా అగ్ర పార్టీలుగా కొనసాగుతున్న డీఎంకే, అన్నాడీఎంకేలను పక్కన పెట్టి విజయ్‌కు పట్టం గట్టే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తున్నది. పార్టీ పెట్టిన తొలిసారే ఎన్టీఆర్ తరహాలో విజయ్ అధికారానికి చేరువయ్యారు. 234 సీట్లు తమిళ అసెంబ్లీలో ప్రస్తుతం 100కుపైగా స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. కింగ్ మేకరా? కింగ్ అవుతారా? అనే ప్రశ్నలకు సమాధానంగా తమిళ రాజకీయాల్లో విజయ్ కింగ్‌గా మారాడనే విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. రానున్న రోజుల్లో రాజకీయాల్లో ఎలాంటి ముద్రను కనబరుస్తాడో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications

