‘ దళపతికి నచ్చేశా.. తెలుగువాడినని తొక్కేశారు.. లోకల్ ఫీలింగ్‌తో దారుణంగా ’
భారతీయ చిత్ర పరిశ్రమ పరిధి నానాటికీ విస్తరిస్తోంది. ఇప్పటికే ఉన్న మార్కెట్‌లకు తోడు కొత్త మార్కెట్‌లు ఇండియన్ సినిమాకు దొరుకుతున్నాయి. దేశంలోని ప్రాంతీయ పరిశ్రమలు కూడా నేడు ఎదుగుతున్నాయి. పాన్ ఇండియా కల్చర్ ఏ ముహూర్తాన ప్రారంభమైందో కానీ అన్ని ఇండస్ట్రీలు భారీ ఎత్తున సినిమాలు తీస్తున్నాయి. అన్ని భాషలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్లకు ఇప్పుడు విరివిగా అవకాశాలు దొరుకుతున్నాయి. అయినప్పటికీ రీజనల్ ఫీలింగ్ మాత్రం ప్రాంతీయ పరిశ్రమల మధ్య పోవడం లేదు.

జాట్‌తో మారుమోగుతోన్న గోపీచంద్ పేరు
బాలీవుడ్ యాక్షన్ సూపర్‌స్టార్ సన్నీడియోల్ నటించిన జాట్‌తో దర్శకుడు గోపీచంద్ మలినేని పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. సరైన సినిమాతో తమ హీరోకి హిట్ ఇచ్చారంటూ ఆయనను సన్నీ అభిమానులు మెచ్చుకుంటున్నారు. బలపు, క్రాక్, వీరసింహారెడ్డిలతో హ్యాట్రిక్ అందుకున్న గోపీ రీసెంట్‌గా జాట్‌తోనూ భారీ హిట్ కొట్టి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్నారు. మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే కమర్షియల్ సినిమాలు ఇటీవల హిందీలో రావడం లేదని అనుకుంటున్న దశలో బాలీవుడ్‌కు ఫుల్ మీల్స్ ఇచ్చారు గోపీచంద్.
బాలీవుడ్‌లో గోపీచంద్ బిజీ?
మాస్ పల్స్ పట్టేయడంతో గోపీ రానున్న రాలంలో బాలీవుడ్‌లో బిజీ అయ్యే అవకాశాలు పుష్కళంగా కనిపిస్తున్నాయి. ఆయనతో సినిమాలు చేసేందుకు పలువురు స్టార్స్ రెడీగా ఉన్నారు. ఇప్పటికే పలు బడా సంస్థలు, వ్యక్తులు గోపీచంద్‌తో సంప్రదింపులు జరిపినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అయితే జాట్ తర్వాత ఆయన ఏ హీరోతో చేస్తున్నారు? ఎలాంటి కథతో వెళ్తున్నారు? బాలీవుడ్‌లో బిజీ అవుతారా? లేక టాలీవుడ్‌కు తిరిగొస్తారా? వంటి అంశాలపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అలాంటి టాలెంటెడ్ దర్శకుడికి తమిళ ఇండస్ట్రీలో అవమానం జరిగిందట.
తమిళ రాజకీయాల్లో బిజీగా విజయ్
ఇళయ దళపతి విజయ్ తన మూడు దశాబ్ధాల సినీ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి దూకారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు విజయ్ కసరత్తు చేస్తున్నారు. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేలపై వాడి వేడి విమర్శలు చేస్తూ అగ్గిరాజేస్తున్నారు విజయ్. ఎన్నికల వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఇళయ దళపతి.
విజయ్ చివరి సినిమా జన నాయగన్
ఎన్నికల ముందే తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను వేగంగా పూర్తి చేస్తున్నారు విజయ్. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జన నాయగన్ చిత్రం దళపతి కెరీర్‌లో 69వది, అలాగే ఆయన నట జీవితంలో ఆఖరిది. దీంతో ఈ సినిమాపై కోలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. తన రాజకీయ జీవితానికి, తమిళనాడు రాజకీయాలకు అనుగుణంగా ఈ సినిమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విజయ్ చివరి సినిమా చేసే అవకాశం గోపీచంద్ మలినేనికి తృటిలో మిస్ అయ్యిందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
తెలుగువాడినని తొక్కేశారు
వీరసింహారెడ్డి హిట్ తర్వాత తను విజయ్ దళపతిని కలిసి కథ చెప్పానని స్క్రిప్ట్ నచ్చడంతో సినిమా చేసేందుకు కమిటయ్యారని గోపీ వెల్లడించారు. ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేసే సమయంలో విజయ్ రాజకీయాల్లో బిజీ అయ్యారని.. ఈ సమయంలో తెలుగు దర్శకుడితో సినిమా చేస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కొందరు చెప్పారని ఆయన ఆరోపించారు. అప్పటికే వారిసును తెలుగు దర్శకుడితో చేయడం , ఆ వెంటనే తెలుగు డైరెక్టర్‌కి ఇవ్వడం బాగోదని విజయ్‌తో చెప్పారేమోనన్న గోపీ, ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు కోలీవుడ్, టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











