God Father: చిరంజీవి చెల్లిగా స్టార్ హీరోయిన్.. పొరపాటున లీక్ చేసిన థమన్
దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. చాలా కాలం పాటు వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. రాజకీయాల కోసం గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు పలు రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఈ సీనియర్ స్టార్ హీరోలో ఉత్సాహం రెట్టించిందనే చెప్పుకోవాలి. ఇక, అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలను ప్రకటిస్తూ చిరంజీవి జెట్ స్పీడుతో దూసుకెళ్లిపోతున్నారు.
రీఎంట్రీలో దూకుడు మీదున్న మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే 'ఆచార్య' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించాడు. మెగా మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో స్పందన దక్కలేదు. దీంతో కలెక్షన్లు అనుకున్న రీతిలో రాలేదు. ఫలితంగా ఈ చిత్రం భారీ నష్టాలతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద చిరంజీవి ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని మిగిలిన చిత్రాలతో ఆయన ఫుల్ బిజీగా మారిపోయారు.

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే పలు సినిమాలను కూడా పట్టాలెక్కించేశారు. అందులో 'గాడ్ ఫాదర్' మూవీ ఒకటి. మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో పృథ్వీ రాజ్ సుకుమారన్ తెరకెక్కించిన 'లూసీఫర్'కు ఇది రీమేక్‌గా రాబోతుంది. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో రూపొందిస్తున్నాడు. పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ గత ఏడాదే మొదలైంది. అంతేకాదు, ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పలు షెడ్యూళ్లను కూడా చిత్ర యూనిట్ విజయవంతంగా కంప్లీట్ చేసేసుకుంది.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవి చెల్లెలి పాత్ర గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా థమన్ పొరపాటున నోరు జారడంతో ఈ రోల్ ఎవరు చేస్తున్నారో లీకైంది. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుందట. ఈ విషయాన్ని మెగాస్టార్ ముందరే థమన్ వెల్లడించాడు. దీంతో ఇన్ని రోజులు దీని గురించి ఉన్న సస్పెన్స్‌కు తెరపడినట్లు అయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక, నయన్ ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూట్‌ను కూడా పూర్తి చేసుకుందట.
పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న 'గాడ్ ఫాదర్' మూవీలో చిరంజీవి రాజకీయాల్లో చక్రం తిప్పే శక్తిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యువ విలక్షణ హీరో సత్యదేవ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రను చేస్తున్నాడు. అలాగే, నయనతార కూడా నటిస్తోంది. ఈ మూవీని ఆగస్టులో విడుదల చేయాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











