ట్రైలర్‌లకు మిలియన్ల వ్యూస్ అంతా ఫేక్.. తెరవెనుక జరిగేదిదే.. దిల్‌రాజు
సినిమాను ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మించిన తర్వాత దానిని ప్రమోట్ చేయడమే అసలైన టాస్క్. థియేటర్ల వద్దకు జనాన్ని రప్పించడం పైనే సినిమా జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. సినిమాలో దమ్ములేకపోయినా పక్కా మార్కెటింగ్ స్ట్రాటజీతో బ్లాక్‌బస్టర్స్‌గా నిలబెట్టిన ఘటనలు ఇండస్ట్రీలో కోకొల్లలు. ట్రైలర్, టీజర్, ఫస్ట్ సింగిల్ అంటూ చేసే హడావుడి కూడా ఇందులో భాగమే. ఈ సందర్భంగా టీజర్లకు వ్యూస్ విషయంలోనూ రికార్డులు, ఫ్యాన్స్ మధ్య గొడవలు సర్వసాధారణంగా మారిపోయాయి. తాజాగా వ్యూస్ వెనుక ఉన్న స్కామ్‌ను బయటపెట్టారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు.
పర్సంటేజ్ విధానంపై వివాదం
థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలు చేయాలంటూ ఇటీవల టాలీవుడ్‌లో పెద్ద వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు బంద్ వరకు వెళ్లగా.. తన సినిమా విడుదలకు ముందు ఈ పరిణామాలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో వివాదం సద్దుమణిగింది. బంద్ ఆలోచన వెనుక ఇండస్ట్రీలో పెద్దలుగా చలామణీ అవుతున్న నలుగురు అగ్ర నిర్మాతల పేర్లు తెరపైకి వచ్చాయి. వీరిలో దిల్‌రాజు పేరు కూడా వినిపించింది.

దిల్‌రాజుపై జనసేన నేత ఆరోపణలు
పవన్ కళ్యాణ్ సీరియస్ కావడంతో దిల్‌రాజు, అల్లు అరవింద్‌లు మీడియా ముందుకొచ్చి తమకు దీనితో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ సినిమాను ఆపేంత దమ్ము ఇండస్ట్రీలో ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. పవన్ ఏ నిర్ణయం తీసుకున్నా తమ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అసలు బంద్ ఆలోచన జనసేన పార్టీకి చెందిన అత్తి సత్యనారాయణదని దిల్‌రాజ్ ఆరోపించడంతో పవన్ సీరియస్ అయ్యారు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సత్యనారాయణను ఆ బాధ్యతల నుంచి తప్పించారు పవన్. దీంతో ఆయన మీడియా ముందుకొచ్చి బంద్ ఆలోచన దిల్‌రాజుది, అతని తమ్ముడు శిరీష్ రెడ్డిదని.. తనను బలి పశువుని చేశారని ఆరోపించారు.
జూలై 4న నితిన్ తమ్ముడు
ఇండస్ట్రీలోని పరిణామాలపై పలువురు నిర్మాతలు, సీనియర్ దర్శకులు పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ వివాదం సద్దుమణగగా.. జూన్ 12న రావాల్సిన పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు అనివార్య కారణాలతో వాయిదా పడింది. ప్రస్తుతం పరిశ్రమలో పరిస్థితులు చక్కబడుతుండగా దిల్‌రాజు మరో బాంబు పేల్చారు. నితిన్ హీరోగా తమ్ముడు అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ నటి లయ కీలకపాత్ర పోషిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు. జూలై 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ వ్యూస్ అంతా ఫేకే
తాజాగా జూన్ 11న తమ్ముడు సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. ఆసక్తికర విశేషాలు చెప్పారు. యూట్యూబ్‌లో ట్రైలర్ రిలీజ్ చేశామని.. దాని కింద కనిపించే నెంబర్లన్నీ ఒరిజినల్ అని పేర్కొన్నారు. ఎంతమంది ప్రేక్షకులు చూస్తారో అవన్నీ కనిపించాలని తన పీఆర్ టీమ్‌కి చెప్పానని దిల్‌రాజు తెలిపారు. డబ్బులు ఖర్చు పెట్టి వ్యూస్ కొనొద్దని.. అప్పుడే ఒరిజినల్‌గా ఎంతమంది చూసిందనేది తెలుస్తుందన్నారు.
జీవితంలో ఫాల్స్‌గా బతకడం అలవాటైతే అదే పెరుగుతుందని సినీ, మీడియా రంగాల్లో ఇది ఎక్కువ ఉంటుందని దిల్‌రాజు అన్నారు. మీడియాలోనూ థంబ్‌నైల్ ఒకటి ఉంటే.. లోపల ఇంకోకటి ఉంటుందని చెప్పారు. నా ట్రైలర్‌ను 10 మిలియన్స్ మంది చూశారా? అని మా ఇంట్లోనే అడిగారని దిల్‌రాజు అన్నారు. ఈ విషయంలో మార్పు తీసుకురావాలని అనుకుని వెంటనే మా పీఆర్ టీమ్‌తో మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దిల్‌రాజు వ్యాఖ్యలు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











