విడాకుల నోటిసు, సాక్షులుగా మీరే.. బాంబు పేల్చిన తరుణ్ భాస్కర్!
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎక్కడ చూసినా విడాకుల వార్తలే. సెలబ్రెటీ కపుల్స్ వారి జీవిత భాగస్వాముల సోషల్ మీడియా ఖాతాలు అన్‌ఫాలో చేస్తే చాలు ఫ్యాన్స్‌కి, ఫాలోవర్స్‌కి ఎక్కడా లేని డౌట్లు. ఇప్పటి వరకు డైవోర్స్ తీసుకున్న స్టార్ కపుల్స్ అంతా ఇలాగే చేయడమే వారి భయానికి కారణం. ఎప్పుడు ఏ హీరో లేదా హీరోయిన్ .. ఏ పోస్ట్ పెడతారోనని పరిశ్రమ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి.
ఇదిలాఉండగా.. పెళ్లిచూపులు సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు దాస్యం తరుణ్ భాస్కర్. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని, అభిమానులను ఆకట్టుకున్నాడు ఈ వరంగల్ కుర్రాడు. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్‌గా జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. ఆ వెంటనే ఈ నగరానికి ఏమైంది, పిట్టకథలు, కీడా కోలా వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. డైరెక్షన్ దగ్గరే ఆగిపోకుండా నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, గీత రచయితగా , హోస్ట్‌గా తనలోని బహుముఖ ప్రజ్ఞను బయటపెట్టారు తరుణ్ భాస్కర్.

మూడంటే మూడే చిత్రాలు చేసినా నవతరం ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడమే మంచిదనే సూత్రాన్ని పాటిస్తూ హడావుడిగా సినిమాలు తీయకుండా తన మనసుకు నిచ్చిన ప్రాజెక్ట్‌లను టేకప్ చేస్తున్నారు. ఈ క్రమంలో తరుణ్ భాస్కర్‌ని ఉద్దేశిస్తూ దర్శకుడు వేణు ఊడుగుల పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. అది విడాకుల నోటీసు లాగా ఉండటంతో అంతా ఉలిక్కిపడ్డారు. దానిని పరీక్షగా చూస్తే కానీ అసలు విషయం అర్ధం కాదు. నిజానికి అదొక క్యాస్టింగ్ కాల్. విడాకుల బ్యాక్‌డ్రాప్‌లో తరుణ్ భాస్కర్, వేణు ఊడుగుల సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. రూ.50 స్టాంప్ పేపర్‌పై ఇడుపు కాగితం అంటూ పక్కా తెలంగాణ పదాన్ని హెడ్డింగ్‌గా పెట్టి ఈ క్యాస్టింగ్ కాల్ అనౌన్స్ చేశారు.
అందులో ..'' తేదీ 12-12-2024 బేస్తారం రోజున ఇల్లంతకుంట శ్రీసీతారామచంద్ర స్వామి గుడెనుక సమ్మక్క సారలమ్మ గద్దెలకాడ, మర్రిశెట్టు కింద జమ్మికుంట వాస్తవ్యులైన బూర సమ్మయ్య గౌడ్ బిడ్డ శ్రీలతకు పోత్కపల్లి గ్రామ వాస్తవ్యులైన గోడిశాల పోశాలు కొడుకు శ్రీనివాస్ గౌడ్ కు ఇడుపు కాయితం పంచాయితీ జరుగుతాంది. ఆ పంచాయితీ పెద్దలుగా, సాక్షులుగా కుటుంబ సభ్యులుగా నటించడానికి నటీనటులు కావాలె.. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు సంప్రదించండి" అని ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు 9032765555 ఫోన్ నెంబర్‌కు ప్రోఫైల్స్‌ను వాట్సాప్ చేయాల్సిందిగా సూచించింది. తరుణ్ భాస్కర్ ఇందులో కీలకపాత్ర పోషిస్తుండగా.. బూసం జగన్మోహన్ రెడ్డి, వేణు ఊడుగుల నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో వేణు ఊడుగుల భాగస్వామ్యం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం సినిమాలతో మంచి అభిరుచిగల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వేణు. ముఖ్యంగా నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన విరాటపర్వం సినిమాకు మంచి పేరొచ్చింది. నక్సలిజం, ప్రేమ అనే అంశాలను సమానంగా డీల్ చేయడంలో వేణు ఊడుగుల తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు పోటెత్తుతున్న దశలో వేణు '' ఇడుపు కాగితం ''పై భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











