Theater Movies: రష్మిక-సుధీర్ బాబు బాక్సాఫీస్ పోరు.. ఈ వారం విడుదలయ్యే సినిమాలు ఇవే..
Theater Releases: సినీ ప్రేక్షకులకు ఈ వారం నిజంగా పండగ వాతావరణమేనని చెప్పాలి. నవంబర్ 7వ తేదీన టాలీవుడ్, కోలీవుడ్, మలయాళ, బాలీవుడ్ నుంచి లవ్, హారర్, థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్ డ్రామా వంటి విభిన్న జానర్లకు చెందిన సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి రానున్నాయి. బాక్సాఫీస్ వద్ద మందన్నా, సుధీర్ బాబు, విష్ణు విశాల్ వంటి స్టార్స్ సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఈ వారం మొత్తం ఆరు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక వివరంగా ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం
1. రష్మిక మందన్నా 'ది గర్ల్‌ఫ్రెండ్'
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన తాజా చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' ఈ వారం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లవ్, ఎమోషన్, రొమాన్స్ మేళవింపుగా రూపొందింది. ఈ మూవీలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే, ప్రేమలో పడిన జంట మధ్య వచ్చే భావోద్వేగాలు, విడిపోవాలనే పరిస్థితులు, తిరిగి కలిసే ఆశ అనే కాన్సెప్ట్‌ను ఈ సినిమా చూపించబోతోంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, విద్య కొప్పినీడి సంయుక్తంగా నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రష్మిక ఈ సినిమాతో మళ్లీ తన రొమాంటిక్ సైడ్‌ను చూపించబోతుంది. యువత ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారని ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి.

2. సుధీర్ బాబు 'జటాధర'
యాక్షన్, హారర్, సస్పెన్స్ మేళవింపుగా రూపొందిన సుధీర్ బాబు తాజా చిత్రం 'జటాధర' ఈ వారం థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో ఆమెకు టాలీవుడ్‌లో తొలి ఎంట్రీ లభించింది. వెంకట్ కళ్యాణ్ - అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మైథలాజికల్ సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. గుప్తనిధులు, పిశాచ బంధనాలు, సైన్స్, కలల నేపథ్యం కలిపిన మిక్స్ జానర్ మూవీగా ఇది పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందింది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, నిఖిల్ నందా నిర్మించారు. హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమా విజువల్స్, బీజీఎమ్‌తో ఆకట్టుకుంటుందని ఇప్పటికే బజ్ వస్తోంది.
3. 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'
'మసూద' ఫేమ్ తిరువీర్, 'కమిటీ కుర్రాళ్లు' ఫేమ్ టీనా శ్రావ్య జంటగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' ఈ వారం నవ్వులతో ప్రేక్షకులను అలరించబోతోంది. పెళ్లి ముందు జరిగే ప్రీ వెడ్డింగ్ షూట్ సమయంలో చోటుచేసుకునే సరదా, గందరగోళ సంఘటనలతో ఈ చిత్రం పూర్తి కామెడీ ప్యాకేజీగా రూపొందింది. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అగరం సందీప్, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7 పీఎం ప్రొడక్షన్స్, పప్పెట్ షోస్ పతాకాలపై నిర్మించారు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ట్రెండ్‌పై ఫన్నీగా సాగే ఈ కథ యూత్‌కి బాగా నచ్చే అవకాశం ఉంది.
4. 'ఆర్యన్'
కోలీవుడ్‌లో మంచి విజయాన్ని సాధించిన 'ఆర్యన్' అనే థ్రిల్లర్ ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఒక సీరియల్ కిల్లర్ కేసు నేపథ్యంలో సాగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్, మైండ్ గేమ్స్, సైకాలజికల్ ట్విస్టులతో కథా ఉత్కంఠభరితంగా సాగుతుంది. తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో, శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి దీనిని తెలుగులో విడుదల చేస్తున్నారు.
5. 'డీయస్ ఈరే' - మలయాళ హారర్ థ్రిల్లర్
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే' ఈ వారం ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమవుతోంది. మిస్టరీ, మానసిక థ్రిల్లర్ జానర్‌లో ఈ సినిమా మలయాళంలో ఇప్పటికే మంచి హిట్ సాధించింది. ఇప్పుడు అదే చిత్రం నవంబర్ 7న తెలుగులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విజువల్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్, సౌండ్ డిజైన్ చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో హారర్ మూవీ లవర్స్‌కు ఈ చిత్రం ఒక మంచి ట్రీట్ అవుతుందని చెప్పవచ్చు.
6. 'ప్రేమిస్తున్నా'
బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన సాత్విక్ వర్మ, ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ప్రేమిస్తున్నా' కూడా నవంబర్ 7న విడుదల కానుంది. ఇందులో ప్రీతి నేహా హీరోయిన్‌గా నటించింది. భాను దర్శకత్వంలో వరలక్ష్మి పప్పుల ప్రెజెంటేషన్‌లో కనకదుర్గారావు పప్పుల నిర్మించిన ఈ చిత్రం ఒక ఫ్రెష్ టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందింది. యువ ప్రేమలోని భావోద్వేగాలు, స్నేహం, విడిపోవడం, తిరిగి కలుసుకోవడం వంటి అంశాలతో ఈ చిత్రం యువతరానికి దగ్గరగా ఉంటుందని టీమ్ చెబుతోంది.
ఈ వారం థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు అన్ని విభిన్న జానర్లకు చెందినవే. లవ్, హారర్, కామెడీ, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా వంటి మిక్స్ జానర్లతో ప్రేక్షకులకు వినోదం పుష్కలంగా అందించనున్నాయి. రష్మిక మందన్నా రొమాంటిక్ లుక్, సుధీర్ బాబు హారర్ థ్రిల్లర్, విష్ణు విశాల్ క్రైమ్ డ్రామా, తిరువీర్ కామెడీ అన్ని కలిపి పుల్ ఎంటర్టైన్మెంట్ ట్రీట్ ఇవ్వబోతున్నాయి. నవంబర్ 7న విడుదలవుతున్న ఈ ఆరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫామ్ చేస్తాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











