‘థియేటర్ల బంద్ సూత్రధారి దిల్‌రాజే.. శిరీష్ రెడ్డి కోసం నన్ను బలి చేశారు’
తెలుగు రాజకీయాల్లో, తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్ల బంద్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. తమకు రెంటల్ విధానం వద్దని, మల్టీప్లెక్స్‌ల తరహాలో పర్సెంటేజ్ విధానం అమలు చేయాలని థియేటర్ల ఓనర్లు డిమాండ్ చేయడంతో వివాదం రాజుకుంది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి థియేటర్ల బంద్ వరకు రావడం, సరిగ్గా అప్పుడే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ ఉండటంతో ఈ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. అప్పటి నుంచి ఈ వివాదం రోజుకొక మలుపు తిరుగుతోంది.
బంద్ లేదన్న ఛాంబర్
థియేటర్ల బంద్ వ్యవహారం వెనుక ఆ నలుగురు ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ధియేటర్లు, డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని శాసిస్తున్న పలువురు అగ్ర నిర్మాతల పేర్లు ఈ విషయంలో బయటికి రావడంతో ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఈ విషయాన్ని తేల్చాలంటూ ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ రంగంలోకి దిగిన నాటి నుంచి కథ అడ్డం తిరిగింది. బంద్ ఆలోచన విరమించుకోవడంతో పాటు అగ్ర నిర్మాతలు మీడియా ముందుకొచ్చి మాకేం సంబంధం లేదంటూ వివరణ ఇచ్చారు.

ఇండస్ట్రీ పెద్దలపై పవన్ ఆగ్రహం
అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇండస్ట్రీ పెద్దల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని, ఇకపై సినిమా టికెట్ల ధరలతో పాటు అంశాలపై తనను వ్యక్తిగతంగా కలవొద్దని హుకుం జారీ చేశారు. ఏం మాట్లాడాలన్నా ఫిలిం ఛాంబర్ ద్వారానే అర్జీ పెట్టుకోవాలని ఆదేశించారు. అలాగే సినిమా హాల్స్‌లో మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలపై దృష్టి సారించాలని, ప్రభుత్వానికి వస్తున్న పన్నులు సరిగా వస్తున్నాయో లేదో తేల్చాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో థియేటర్స్ బంద్ ప్రతిపాదన చేసింది జనసేన నేత, సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణే అని చెప్పడంతో ఆయనపై వేటు వేశారు పవన్ కళ్యాణ్. జనసేన ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజమండ్రి నగర జనసేన ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తప్పించారు.
మీడియా ముందుకు అత్తి సత్యనారాయణ
ఈ పరిణామాలతో అత్తి సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి దిల్‌రాజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్‌రాజు, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, ఏషియన్ సునీల్.. ఈ నలుగురే థియేటర్ల బంద్ వెనుక ఉన్నారని ఆరోపించారు. ఏ మీటింగ్‌లోనూ తాను పాల్గొనలేదని.. మే 21, 2024న తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ల సినిమాలు ఉన్నాయని దానిని తుంగలో తొక్కి పెద్ద సినిమాలు ఉన్నాయని జూన్ 1 నుంచి అమలు చేయడానికి ఆ నలుగురు కుట్ర పన్నారని అత్తి సత్యనారాయణ ఆరోపించారు. థియేటర్ల బంద్ ప్రకటన చేసింది దిల్‌రాజు తమ్ముడు శిరీష్ అని దీనిని సునీల్, సురేష్ బాబులు ఖండించలేదని అత్తి సత్యనారాయణ ధ్వజమెత్తారు.
మీకు సహకరించలేదని నింద వేస్తారా
తూర్పుగోదావరి జిల్లాలో థియేటర్ రెంట్లు చాలా తక్కువని నైజాంలో ఐదు లక్షల రెంట్లు ఉన్న థియేటర్లు ఉన్నాయని ఆయన తెలిపారు. మిగతా ఏరియాలతో పోలిస్తే మేం చాలా లాస్‌లలో ఉన్నామని బాధపడుతూ డిస్ట్రిబ్యూటర్లను రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నామని సత్యనారాయణ వెల్లడించారు. 11 నెలలుగా ఛాంబర్ మీటింగ్‌లో నేను పాల్గొనలేదని అలాంటిది మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, మీ తమ్ముడు తొడకొట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా జూన్‌లో ఉందని మీకు తెలుసని సత్యనారాయణ పేర్కొన్నారు. థియేటర్‌ల బంద్ చేయడానికి మేం అంగీకరించకపోవడంతో మీరు ఆ నింద మా మీద తోశారని దిల్‌రాజుపై ఆరోపణలు చేశారు.

థియేటర్ల బంద్‌ని దిల్‌రాజు ఖండించలేదు
ఛాంబర్ ద్వారానే నన్ను కలవాలన్న పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని దిల్‌రాజు అన్నారని, థియేటర్‌ల బంద్‌ని మీరెందుకు ఖండించిలేదని సత్యనారాయణ ప్రశ్నించారు. మమ్మల్ని అడ్డుపెట్టుకుని నువ్వు నైజాం నవాబుగా ఏలాలని అనుకుంటున్నావా? అని ఆయన దిల్‌రాజుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ ప్రతిపాదనకు మేం ఒప్పుకోలేదని మమ్మల్ని ఇరికిస్తావా? అంటూ సత్యనారాయణ మండిపడ్డారు. జరిగినదంతా ప్రజలు గమనిస్తున్నానే ఉన్నారని, నేను ఎలాంటి వాడిననే సంగతి పవన్ కళ్యాణ్ గారికి తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ వాళ్ల తోలు తీసేస్తారు
ఆంధ్రాకి సంబంధించిన ఎగ్జిబిటర్ సెక్టార్ ఛైర్మన్ రాంప్రసాద్‌తో దిల్‌రాజు, సురేష్ ఒత్తిడి తీసుకొచ్చి ఛాంబర్‌లో లెటర్ పెట్టించారని సత్యనారాయణ ఆరోపించారు. మూడు సెక్టార్లలో ఎట్టి పరిస్ధితుల్లోనూ జూన్ 1 నుంచి బంద్ ఖాయమని ప్రకటించారా?లేదా? అని ఆయన ప్రశ్నించారు. దీనిని నా మీదకి నెట్టి మీరు తప్పించుకుందామని అనుకుంటే దేవుడు ఉన్నాడని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గారికి జరుగుతున్నదంతా తెలుసని దీని వెనుక ఉన్నవారి తోలు తీస్తారని హెచ్చరించారు.
నా రాజకీయ భవిష్యత్‌తో ఆడుకుంటారా
జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి తాను పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని సత్యనారాయణ స్పష్టం చేశారు. సినిమాల వ్యాపారం బాలేదని.. అయినప్పటికీ అన్ని పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడుతున్నానని ఆయన పేర్కొన్నారు. నా రాజకీయ భవిష్యత్ మీద జనసేన నేత అని పేరు చెప్పి నన్ను ఇరికించడం కరెక్ట్ కాదని సత్యనారాయణ మండిపడ్డారు. హరిహర వీరమల్లుని బ్యాన్ చేయమన్నట్లుగా వీడియో ఉందని మీరు నిరూపించండి, లేదంటే నేను కోర్టుకెళ్తానని ఆయన ఛాలెంజ్ విసిరారు. జిల్లాలో ఎన్ని థియేటర్లు మూసివేసి ఉన్నాయో అందరికీ తెలుసని, ఎగ్జిబిటర్ల భవిష్యత్తు దృష్ట్యా థియేటర్లు క్లోజ్ చేస్తామని అన్నాం కానీ బంద్ అనే మాట రాలేదని సత్యనారాయణ స్పష్టం చేశారు.
పవన్‌ను ఆపడం ఎవరి వల్లా కాదు
మీ సినిమాలు ఉన్నప్పుడు నిర్ణయాన్ని అమలు చేయకుండా పవన్ కళ్యాణ్ సినిమాను తొక్కేద్దామనే దురాలోచనను నేను అడ్డుకున్నానని సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్ధితుల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే ప్రసక్తే లేదని, పెద్ద హీరోల సినిమా అందులోనూ మా దేవుడి సినిమాని ఆపడానికి నేను కుట్ర పన్నుతానా? అని సత్యనారాయణ ప్రశ్నించారు. పవన్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం లేదని అల్లు అరవింద్ , దిల్‌రాజు వంటి వారే చెప్పినప్పుడు చిన్న డిస్ట్రిబ్యూటర్ అయిన నాకు అంత ధైర్యం ఉంటుందా అని నిలదీశారు. దిల్‌రాజు గారి ఆస్కార్ అవార్డ్ నటన అందరూ చూశారు, ఆయన వ్యక్తిత్వం జనానికి తెలియాలి.
అగ్నిపరీక్షలో గెలుస్తా
పార్టీకి ఇన్నాళ్ల నుంచి విధేయంగా ఉంటూ వచ్చానని.. అలాంటిది పార్టీ నుంచి ఇలాంటి నిర్ణయాన్ని ఊహించలేదని అనుశ్రీ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నా దేవుడు నాకు అవకాశం ఇచ్చారని, దానిని బట్టి పార్టీకి నా మీద కాస్తయినా నమ్మకం ఉందని అన్నారు. నేను వ్యక్తిగతంగా దీనిని పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని సత్యనారాయణ స్పష్టం చేశారు. నీతి, నిజాయితీకి జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ మారు పేరని.. నా దేవుడు నాకు అగ్నిపరీక్ష పెట్టారని ఆయన అన్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు నా వెన్నంటే ఉన్నారని ఇందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.


Click it and Unblock the Notifications











