వివాదానికి శుభం కార్డ్.. జూన్ 1న థియేటర్ల బంద్ లేదు.. ఫిలిం ఛాంబర్ ప్రకటన
సినీ పరిశ్రమకు గుండెకాయ వంటి థియేటర్లు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాయి. కరోనా కొట్టిన దెబ్బ నుంచి కోలుకునే లోగా, ఓటీటీలు వచ్చి లేవకుండా చావ చితక్కొట్టాయి. థియేటర్‌లో వచ్చిన మూడు నాలుగు వారాల్లోనే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో ప్రేక్షకులు థియేటర్‌కు రావడం లేదు. నాలుగు రోజుల్లో వచ్చే సినిమా కోసం జేబులు ఖాళీ చేసుకునేందుకు గతంలో మాదిరిగా ప్రేక్షకులు సిద్దంగా లేరు. ఈ పరిణామాలతో థియేటర్లు ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ల మనుగడ కష్టమైంది. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మల్టీప్లెక్స్‌లలో అమలు చేసే పర్సెంటేజ్ విధానం థియేటర్లకు కూడా వర్తింప చేయాలని ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.
పర్సంటేజ్ విధానంపై పట్టు
థియేటర్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై గత కొద్దిరోజులుగా ఛాంబర్‌లో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తమ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని థియేటర్ యజమానులు హెచ్చరించారు. అయితే నిర్మాతల అభిప్రాయం తీసుకోకుండా థియేటర్ల బంద్ ప్రకటనపై ఫిలిం ఛాంబర్‌లో వాడి వేడి చర్చ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే సరిగ్గా ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌కు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. ఇంతలో ఆ నలుగురు అంటూ తెలుగు రాష్ట్రాల్లో సినిమా డిస్ట్రిబ్యూషన్‌ను శాసిస్తోన్న కొందరు నిర్మాతల పేర్లు బయటికొచ్చాయి. వీరే పట్టుదలగా థియేటర్ల బంద్‌కు పిలుపునిచ్చి కథ నడిపిస్తున్నారంటూ ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. గుత్తాధిపత్యంతో బ్లాక్‌మెయిల్ చేయాలని ఆ నలుగురు భావిస్తున్నట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
థియేటర్ల బంద్‌పై ఏపీ సర్కార్ సీరియస్
థియేటర్ల బంద్, తదితర పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. జూన్ 1న థియేటర్ల మూసివేతపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విచారణకు ఆదేశించారు. అలాగే దుర్గేష్ హైదరాబాద్‌కు వచ్చి ఆ నలుగురితో భేటీ అవుతారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సమావేశానికి దగ్గుబాటి సురేష్ బాబు, దిల్‌రాజు, ఏషియన్ సునీల్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది.
వివాదానికి తెరదించిన ఫిలిం ఛాంబర్
అయితే ఈ వివాదం అంటు తిరిగి ఏటో పోతుండటంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆగమేఘాల మీద స్పందించింది. మే 24న హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా థియేటర్ యజమానుల సమస్యలు, ఇబ్బందులపై చర్చించారు. అనంతరం జూన్ 1న థియేటర్ల బంద్ ఉండదని, ఆ రోజున యథావిధిగా థియేటర్లు నడుస్తాయని ఛాంబర్ ప్రకటించి వివాదానికి తెరదించింది. తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
ఫిలిం ఛాంబర్‌దే తుది నిర్ణయం
థియేటర్ల బంద్ గురించి ఎవరికి నచ్చిన విధంగా వారు ప్రచారం చేసి అసలు వివాదాన్ని, సమస్యను తప్పుగా చిత్రీకరించారని దామోదర్ ప్రసాద్ మండిపడ్డారు. జూన్ 1వ తేదీన థియేటర్ల బంద్ గురించి తమ మధ్య ప్రస్తావన వచ్చిందని, కానీ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అనుకున్నామని తెలిపారు. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే బంద్ అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయని దామోదర్ ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో ఎన్నో సమస్యలు ఉన్నాయని అన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని వెల్లడించారు. థియేటర్ల బంద్‌పై వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని, తెలుగు ఫిలిం ఛాంబర్ చేసే ప్రకటనే అంతిమమని దామోదర ప్రసాద్ తెలిపారు.


Click it and Unblock the Notifications











