కాదంబరీ జత్వానీ కేసు .. ఆ ముగ్గురు పోలీస్ పెద్దలపై వేటు, .. నెక్ట్స్ వారేనా?
ముంబైకి చెందిన సినీ నటి కాదంబరీ జత్వానీని విజయవాడకు చెందిన కొందరు వైసీపీ నేతలు శారీరికంగా, మానసికంగా వేధించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంలో కలగజేసుకున్నారంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు. కాదంబరీ కేసులో ప్రమేయం ఉన్న ఎవరినీ వదిలిపెట్టేది లేదని, ఎంతటి పై స్థాయిలో ఉన్నా శిక్ష పడేలా చేస్తామని ఏపీ సీఎం స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.
కృష్ణాజిల్లా మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ కుక్కల నాగేశ్వరరావు తనయుడు విద్యాసాగర్ అనే వైసీపీ నేత ముంబైకి చెందిన సినీనటి కాదంబరీ జత్వానీని ప్రేమ పేరుతో లొంగదీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే కాదంబరీ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచడంతో విద్యాసాగర్ ఆమెను వదిలించుకోవాలని చూసినట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది. స్వతహాగా పారిశ్రామికవేత్త కావడంతో పాటు నాటి వైసీపీ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఈ వివాదం నుంచి గట్టెక్కాలని విద్యాసాగర్ భావించినట్లుగా ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

దీనిలో భాగంగా ముంబై నటిపై తప్పుడు కేసులు పెట్టి బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులను జైలుకు పంపినట్లుగా పత్రికల్లో కథనాలు వచ్చాయి. కాదంబరీ జత్వానీ, ఆమె కుటుంబీకులపై విద్యాసాగర్ ఫిర్యాదు చేయగా దీని ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, మోసం, బెదిరింపు వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం విజయవాడ నుంచి ఓ స్పెషల్ టీమ్ ముంబై వెళ్లి కాదంబరీని, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చి స్థానిక కోర్టులో హాజరుపరిచారు.
పోలీసుల అభియోగాల ఆధారంగా న్యాయస్థానం సినీనటి, ఆమె కుటుంబ సభ్యులకు రిమాండ్ విధించింది. 42 రోజల పాటు జైల్లోనే ఉన్న హీరోయిన్ కుటుంబం ఎట్టకేలకు బయటికొచ్చింది. మరోసారి పెళ్లి మాటెత్తితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి.. కాదంబరీ, ఆమె కుటుంబ సభ్యులతో సంతకాలు చేయించుకున్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో కాదంబరీ, ఆమె ఫ్యామిలీ తిరిగి ముంబైకి వెళ్లిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓడిపోయి టీడీపీ ప్రభుత్వం రావడంతో కాదంబరీ జత్వానీ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం కాదంబరీ నేరుగా విజయవాడ సీపీని కలిసి తనకు జరిగిన అన్యాయంపై వాపోయారు. వైసీపీ నేతలు, పోలీసుల వల్ల తాను , తన కుటుంబం చాలా ఇబ్బంది పడ్డామని కాదంబరీ జత్వానీ ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఇబ్బందిపెట్టిన ముగ్గురు ఐపీఎస్‌లు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై కాదంబరీ ఫిర్యాదు చేసింది.

ఈ వ్యవహారం మీడియాలో హైలైట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణాధికారిని నియమించి దర్యాప్తు చేయిస్తోంది. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా తేలడంతో నాడు విజయవాడలో విధులు నిర్వర్తించిన ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తాజాగా ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపైనా ప్రభుత్వం వేటు వేసింది.
ముగ్గురు ఐపీఎస్‌ల సస్పెన్షన్ ఫైల్‌పై సీఎం చంద్రబాబు సంతకం చేయగా.. ప్రభుత్వం జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల చేసింది. దీనిని కాన్ఫిడెన్షియల్ అని ప్రభుత్వ వెబ్‌సైట్ పేర్కొంది. డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు వేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











