దిగొచ్చిన పుష్ప 2 మేకర్స్ .. సోమవారం నుంచి కొత్త టికెట్ ధరలు, ఏ థియేటర్‌లో ఎంతంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలీవుడ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప ది రైజ్ (పుష్ప 1)కి సీక్వెల్‌గా పుష్ప 2ని తెరకెక్కించారు. రిలీజైన క్షణం నుంచే పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో దూసుకెళ్తోంది ఈ సినిమా. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా టికెట్ల ధరలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఇటీవలి కాలంలో టాలీవుడ్ నుంచి ఏ పెద్ద సినిమా విడుదలైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధర పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. అలాగే స్పెషల్ షో, బెనిఫిట్ షోలకు కూడా అనుమతిస్తున్నాయి . తాజాగా పుష్ప 2కి కూడా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశాలు కల్పించింది. దీని ప్రకారం .. ఆదివారం వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీప్లెక్స్‌లో రూ. 200 పెంచారు. దీనిని బట్టి మల్టీప్లెక్స్‌లో పుష్పను చూడాలంటే రూ.500 .. సింగిల్ స్క్రీన్‌లలో రూ.300 పైనే వెచ్చించాల్సి ఉంటుంది.

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ధరలకే ఏమాత్రం తగ్గకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పుష్ప 2 టికెట్ల ధరలు పెంచుకునేందుకు మేకర్స్‌కి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే పుష్ప 2 సక్సెస్ మీట్‌లో తమకు అండగా నిలిచిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్‌లకు హీరో అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. మరీ ముఖ్యంగా , వ్యక్తిగతంగా కళ్యాణ్ బాబాయ్‌కి థాంక్స్ చెప్పారు బన్నీ.
సినిమాకి హిట్ టాక్ వచ్చినా? థియేటర్‌లో చూడాలని అనుకుంటున్నా? టికెట్ ధరలు సగటు అభిమానిని బెంబేలెత్తించాయి. సోషల్ మీడియాలో అయితే టికెట్ ధరలపై సెటైర్లు , ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరిగింది. ఈ నేపథ్యంలో పుష్ప నిర్మాతలు స్వయంగా హీరో అల్లు అర్జున్ స్పందించారు. కేవలం ప్రీమియర్ షోకు మాత్రమే టికెట్ ధర పెంచామని .. త్వరలోనే అన్ని రివ్యూలు చేసుకుని , ధరలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. ఈ క్రమంలోనే టికెట్ ధరలు తగ్గినట్లుగా తెలుస్తోంది.
డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 16 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.105 , మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నైజాం ఏరియాలో ప్రభుత్వం అనుమతించిన ధరతో పోలిస్తే టికెట్ ధరలు తగ్గినట్లుగా టికెట్లు విక్రయించే బుక్ మై షోలో కనిపిస్తోంది. ఈ వెబ్‌సైట్‌లో సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ. 200 , మల్టీప్లెక్స్‌లో రూ.395 (రెండింటిపై జీఎస్టీ అదనం) చూపిస్తోంది. ఈ పరిణామాలతో అల్లు అర్జున్ అభిమానులు సంబరపడుతున్నారు. ఇప్పటి వరకు టికెట్ ధరలు చూసి భయపడ్డ ప్రేక్షకులు ఇకపై థియేటర్‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











