సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆర్జీవి, టాలీవుడ్ డైరెక్టర్స్.. సడెన్‌గా ఇప్పుడే ఎందుకంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ దర్శకులు కలిశారు. మే 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా వారు ఆహ్వానించారు. డైరెక్టర్లు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు సీఎంను కలిసినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారు శాలువాతో సత్కరించారు. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సత్సంబంధాలు కొనసాగించడం చిత్రసీమకు తొలి నుంచి అలవాటు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి సీఎంగా పగ్గాలు అందుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా నిలిచారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడంతో పాటు కరోనా సమయంలోనూ సాయం చేశారు. నాడు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు టాలీవుడ్ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆడియో లాంచ్‌లు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకు తారక రామారావు హాజరయ్యారు. పదేళ్ల పాటు టాలీవుడ్ ఏం కోరుకుంటే అది అందేలా కేసీఆర్ ప్రభుత్వం సహకరించింది.

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఓటమిపాలవ్వగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి , మంత్రులను కలిసి అభినందనలు తెలియజేశారు. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఉన్నంత క్లోజ్‌గా వారు లేరనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమాటోగ్రఫీ మంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎవరూ కనీసం స్పందించలేదని, దిల్‌రాజు తప్పించి ఎవరూ కనీసం విషెస్ చెప్పలేదని మండిపడ్డారు. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తనకు తెలియాలని.. వారం రోజుల్లో పరిశ్రమపై నివేదిక ఇవ్వాలని సెక్రటరీని ఆదేశించినట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఇది జరిగిన కొద్దిరోజులకే కోమటిరెడ్డి వద్దకు పరిశ్రమ పెద్దలు క్యూ కట్టారు. దిల్‌రాజు, సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సీ కళ్యాణ్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, కే రాఘవేంద్రరావుతో పాటు ఛాంబర్ సభ్యులు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు వెంకట్ రెడ్డిని కలిశారు.

అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం టాలీవుడ్‌పై పట్టు బిగించిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో చోటు చేసుకున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసును తిరిగి తోడేందుకు ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. కొందరు సినీ సెలబ్రెటీలు డ్రగ్స్ వాడుతున్నారని.. వారిపై కఠినచర్యలు తీసుకుంటామని సీపీ శ్రీనివాస్ రెడ్డి అప్పట్లో హెచ్చరించారు.
డ్రగ్స్ రహిత నగరంగా హైదరాబాద్ మారాలని.. డ్రగ్స్ కల్చర్‌ను ఆపితే డిమాండ్ తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. హద్దుల్లో ఉండకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చిత్ర పరిశ్రమకు చెప్పడానికే రేవంత్ ప్రభుత్వం ఈ హెచ్చరికలు పంపిందని ఫిలింనగర్‌లో చర్చ జరిగింది.
ముఖ్యమంత్రి అండ్ కోను శాంతింపజేయకుంటే ఇబ్బందులు తప్పవని గ్రహించిన పెద్దలు ఇకపై తరచుగా ప్రభుత్వ పెద్దలను కలవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే డైరెక్టర్స్ డేకు సీఎంకు ఆహ్వానం అందినట్లుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











