ఆసుపత్రిలో చేరిన మంచు మనోజ్ .. మెడకి కట్టు, నడవలేని స్థితిలో .. గొడవ నిజమేనా?
ఈ ఏడాది టాలీవుడ్‌లో పలు కాంట్రవర్సీలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్, జానీ మాస్టర్ , హేమ ఇష్యూలు ఇండస్ట్రీని తీవ్రంగా కుదిపేశాయి. మరికొద్దిరోజుల్లో
2024కి ఎండ్ కార్డ్ పడుతున్న వేళ చిత్ర పరిశ్రమలో మరో ఘటన కలకలం రేపింది. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఏదో జరుగుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఆస్తులు, విద్యాసంస్థల పంపకాల విషయంలో మోహన్ బాబుకి , మంచు మనోజ్‌కి పడటం లేదంటూ ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది.
మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు చోటు చేసుకుంటున్నాయంటూ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా ఆ ఫ్యామిలీపై రకరకాల గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అన్నదమ్ములిద్దరికీ పడటం లేదని.. మోహన్ బాబు కూడా మనోజ్‌తో అంటి ముట్టనట్లుగా ఉంటున్నారని ఫిలింనగర్ టాక్. మనోజ్ - భూమా మౌనిక పెళ్లి సమయంలో విష్ణు అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ తర్వాత కొద్దిరోజులకే విష్ణు తన అనుచరులు, బంధువులతో గొడవ పడుతున్నాడంటూ మనోజ్ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది.

ఈ వీడియో తెలుగునాట దుమారం రేపగా .. మోహన్ బాబు, తదితర పెద్దలు రంగంలోకి దిగడంతో మనోజ్ సదరు వీడియోను తొలగించారని అంటారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ప్రస్తుతానికి అక్క మంచు లక్ష్మీనే మనోజ్ పెద్ద దిక్కుగా భావిస్తున్నాడట. ఏం జరిగినా , ఏ కష్టమొచ్చినా ఆమెతోనే షేర్ చేసుకుంటున్నాడు. ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న మనోజ్ .. భార్యాబిడ్డలతో గడిపేందుకే సమయాన్ని కేటాయిస్తున్నాడు.
మంచు మనోజ్ ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇలాంటి దశలో ఆదివారం మోహన్ బాబు - మనోజ్‌ల మధ్య గొడవ జరిగి ఇద్దరూ కొట్టుకుని పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. తనపై , తన భార్య మౌనికపై తన తండ్రి మోహన్ బాబు దాడి చేశాడని.. మనోజ్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారట. అయితే మనోజ్ తనపై దాడి చేసినట్లుగా మోహన్ బాబు మరో ఫిర్యాదు చేసినట్లుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ కాసేపటికే మంచు ఫ్యామిలీ స్పందించింది. మోహన్ బాబు- మనోజ్‌ల మధ్య ఎలాంటి గొడవ జరగలేదని మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమంటూ క్లారిటీ ఇచ్చింది.
అయితే ఆ కొద్దిసేపటికే మంచు మనోజ్ ఆసుపత్రిలో చేరారు. కాలికి గాయం కావడంతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కారు దిగిన ఆయన హాస్పిటల్‌లోకి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డారు. భార్య, మరో వ్యక్తి భుజాలపై చేతులు వేసి కుంటుతూనే నడుచుకుంటూ వచ్చారు మనోజ్. ఆయన రాక విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో చేరుకుని మనోజ్ దంపతులను ప్రశ్నించగా ఇద్దరూ స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనోజ్ ఎలా గాయపడ్డాడు? తండ్రీ కొడుకుల గొడవ నిజమేనా? లేక ప్రమాదవశాత్తూ మనోజ్ గాయపడ్డాడా? అనేది తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











