Chandra Mohan Death:చంద్రమోహన్ మృతిపై ప్రముఖుల సంతాపం.. ఎవరెవరు ఏమన్నారంటే?
సీనియర్ నటుడు, హీరో చంద్రమోహన్ ఈరోజు ఉదయం కన్ను మూశారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం 9.45 గంటలకు హృద్రోగంతో ప్రాణాలు కోల్పోయారు. 82 ఏళ్ల వయసు కల్గిన చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే సోమవారం రోజు హైదరాబాద్ లో ఆయన అంత్యక్రియలు జరుగనున్నట్లు తెలుస్తోంది. చంద్రమోహన్ మృతి వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు అంతా కంటతడి పెడుతున్నారు.
సినీనటుడు చంద్రమోహన్ గారి మృతి పట్ల టీడీపీ ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పౌరానిక చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, తన హాస్యానటనతో తెలుగు ప్రేక్షకులను చంద్రమోహన్ ఆకట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు. చంద్రమోహన్ తో పాటు పలు చిత్రాల్లో నటించానని, ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు లోటు అన్నారు. చంద్రమోహన్ ఆత్మకు శాంతికలగాలని భగవంతున్ని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని బాలకృష్ణ తెలిపారు.

చంద్రమోహన్ గారు ఎన్నో దశాబ్దాలుగా చలన చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారని జూనియర్ ఎన్టీఆర్ వివరించారు. ఆయన అకాల మరణం చెందడం చాలా బాధాకరం అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. చంద్రమోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
అలాగే హీరో కల్యాణ్ రామ్ స్పందిస్తూ... విలక్షణ నటుడు చంద్రమోహన్ గారి అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు అని ఎక్స్ వేదికగా చెప్పుకొచ్చారు. ఆయనతో పలు సినిమాల్లో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. చంద్రమోహన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
చంద్రమోహన్ మృతిపై హీరో సాయి ధరమ్ తేజ్ కూడా స్పందించారు. ఆయన మొహం గుర్తుకు వస్తేనే అద్భుతమైన జ్ఞాపకాలు వస్తాయని.. ఆయన చిరస్మరణీయమైన నటన, అద్భుతమైన పాత్రలతో ప్రతిసారీ మన పెదవులపై చిరునవ్వు వస్తుందని చెప్పుకొచ్చాడు.
చంద్రమోహన్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి కూడా సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా.. "'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'రాధాకళ్యాణం', 'నాకూ పెళ్ళాం కావాలి' లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా కౌశలం ద్వారా తెలుగు వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం ఎంతో విషాదకరం" అని చెప్పుకొచ్చారు. అలాగే తన తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' లో ఒక మూగవాడి పాత్రలో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారని గుర్తు చేసుకున్నారు.
ఆ సందర్భంగా ఏర్పడిన తమ తొలి పరిచయం, ఆ తర్వాత మంచి స్నేహంగా, మరింత గొప్ప అనుబంధంగా మారిందని వివరించారు. ఆయన సాన్నిహిత్యం ఇక లేకపోవటం తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ.. చంద్రమోహన్ కుటుంబ సభ్యులకు , అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి చెబుతున్నట్లు చిరంజీవి వివరించారు.
చంద్రమోహన్ మృతిపై హీరో నాని కూడా స్పిందించారు. తన చినప్పుడు వచ్చిన చిత్రాల్లో ఎక్కువగా ఆయన కనిపించేవారని చెప్పుకొచ్చారు. అలాగే హార్ట్ బ్రోకెన్ ఎమోజీతో పాటు దండం పెట్టే ఎమోజీని షేర్ చేశారు.
అలాగే మంచు విష్ణు స్పందిస్తూ.. చంద్రమోహన్ మరణ వార్త వినడానికి చాలా బాధగా ఉందని అన్నారు. అతను ఒక అద్భుతమైన నటుడు అని ఆయన సినిమాలు చూస్తూనే తాను పెరిగినట్లు చెప్పారు. ఢీ సినిమాలో అతనితో కలిసి నటించానని.. అప్పుడే ఆయన ప్రేమను చూశానని చెప్పుకొచ్చారు. మనమంతా ఆయన్ను మిస్ అవుతామని పేర్కొన్నారు.
చంద్రమోహన్ మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని విక్టరీ వెంకటేష్ వెల్లడించారు. ఈ కష్ట సమయంలో తన దగ్గరి, ప్రియమైన వారు ధైర్యంగా ఉండాలని చెప్పారు. అలాగే ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు స్పందిస్తూ.. పదహారేళ్ళ వయసు సినిమా నుంచి తమ స్నేహం మొదలైందని అన్నారు. తనకు చంద్రమోహన్ మంచి మిత్రుడు అని చెప్పారు. అలాగే మంచి మనిషి అయిన చంద్ర మోహన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం అని రాసుకొచ్చారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











