Year End 2023: ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు వీళ్లే..!
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అతి పెద్ద పండగ. కొంత మంది ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకున్నా.. మొదటి వివాహాన్ని మాత్రమే చాలా గ్రాండ్ గా చేసుకుని, ఆ తర్వాత పెళ్లిళ్లను చాలా లైట్ గా కానిచ్చేస్తుంటారు. అందుకే పెళ్లి అనగానే చాలా మంది పెద్ద తంతుగా భావిస్తుంటారు. 2023 లో చాలా మంది సెలబ్రిటీలు తమ బ్యాచిలర్ జీవితానికి ఫుల్ స్టాప్ చెప్పేసి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. పెద్దలు కుదిర్చిన వారితో కొందరు, మనసుకు నచ్చిన వారిని ప్రేమించి, మనువాడిన వారు మరికొందరు ఉన్నారు. ఏడడుగులు నడిచి వివాహ బంధంలో అడుగుపెట్టారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కు చెందిన సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని గడుపుతున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చి తనదైన విభిన్న తరహా చిత్రాలు చేస్తూ మంచి గుర్తింపు అందుకున్నాడు వరుణ్ తేజ్. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి పేరు, గుర్తింపు అందుకుంది. వీరిద్దరిది ప్రేమ వివాహం. ఇరు వైపు పెద్దలు ఒప్పుకోవడంతో ఆడంబరంగా వీరి పెళ్లి జరిగింది. నవంబర్ 1వ తేదీన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలో హిందూ వివాహ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

టాలీవుడ్ మరో యంగ్ హీరో శర్వానంద్ కూడా ఈ ఏడాది పెళ్లిపీటలెక్కాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనిపించుకున్న శర్వానంద్ 2023 లో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. రక్షితా రెడ్డి మెడలో తాళి కట్టి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. శర్వానంద్, రక్షితా రెడ్డి వివాహం.. రాజస్థాన్ లోని జైపూర్ లో ఈ ఏడాది జూన్ 2వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది.

టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు సీనియర్ యాక్టర్ నరేష్. తన పెళ్లి గురించి టాపిక్ తో టాలీవుడ్ లో రచ్చ లేపాడు. సీనియర్ నటి, ఒకప్పటి హీరోయిన్ పవిత్రతో నరేష్ సంబంధం గురించి ఇటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు అటు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగింది. నరేష్ కు గతంలో మూడు పెళ్లిళ్లు జరగడం, అవి పెటాకులు కావడం తెలిసిందే. పవిత్రకు కూడా గతంలో పెళ్లి జరిగింది. వీరిద్దరి మధ్య మొదలైన బంధం వివాహానికి దారి తీసింది. ఎంత వివాదాస్పదమైనప్పటికీ వీరిద్దరూ ఎక్కడా వెనక్కి తగ్గకుండా వివాహం చేసుకున్నారు. ఇది పవిత్రకు నరేష్ తో మూడో పెళ్లి కాగా, నరేష్ కు నాలుగో వివాహం కావడం విశేషం.

మంచు ఫ్యామిలీలో చిన్నోడు, మోస్ట్ ఎనర్జిటిక్ గా పేరున్న మంచు మనోజ్ ఈ ఏడాది పెళ్లిపీటలెక్కాడు. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న భూమా మౌనికా రెడ్డిని మంచు మనోజ్ మార్చి 3వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. మంచు మనోజ్ కు గతంలోనే వివాహం జరిగిన విషయం తెలిసిందే. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత మనోజ్ మౌనికా రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అటు మౌనికా రెడ్డికి కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











