డైరెక్టర్ బాబీ ఇంట్లో విషాదం.. మెగాస్టార్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగానే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మాస్ కమర్షియల్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న దర్శకుడు బాబి మెగాస్టార్ చిరంజీవితో కూడా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగానే అతని కుటుంబంలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

తండ్రి మృతి
డైరెక్టర్ బాబి అసలు పేరు KS. రవీంద్ర. అయితే ఈరోజు బాబీ తండ్రి కొల్లి మోహనరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కొన్ని అనారోగ్య సమస్యల వలన ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. కాలేయ సంబంధిత వ్యాధి ఇటీవల తీవ్రంగా కావడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కూడా చేర్పించారు. తన తండ్రి ఆరోగ్యం పై దర్శకుడు బాబీ గత కొన్ని రోజులుగా హాస్పిటల్ లోనే వైద్యులతో చర్చలు కూడా జరిపారు.

తండ్రి కోలుకోవాలని
అలాగే తండ్రి కోలుకోవాలని దర్శకుడు బాబి చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్న సమయంలో వారి తండ్రి మృతి చెందినట్లు తెలుస్తోంది. 69 ఏళ్ల మోహన రావుకు తన కొడుకు అంటే ఎంతో ఇష్టం. కొడుకుని తన ఇష్ట ప్రకారమే సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు అవ్వడానికి మద్దతు ఇచ్చారు. తండ్రి సపోర్ట్ తోనే ఇంతవరకు వచ్చాను అని బాబు కూడా తరచుగా చెబుతూ ఉంటాడు.

విషాదంలో బాబీ
ఇక హఠాత్తుగా ఎంతో ప్రాణానికి ప్రాణమైన తండ్రి తనువు చాలించడంతో బాబీ కన్నీరు మున్నీరైనట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ బాబు కి ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు మిత్రులుగా ఉన్నారు. ముఖ్యంగా గోపీచంద్ మలినేని సినిమాలకు కూడా బాబి సహాయక దర్శకుడుగా వర్క్ చేసి ఎంతో కష్టపడి ఇంతవరకు వచ్చాడు. బాబీ కొన్ని సినిమాలకు రచయితగా కూడా వర్క్ చేశాడు.

మెగాస్టార్ సినిమాతో..
ఇక రవితేజ పవర్ సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాబీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమా చేశాడు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ అనే సినిమా కూడా చేశాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య అనే సినిమా మొదలు పెట్టడానికి బాబి రెడీ అవుతున్నాడు. ఇంతలోనే అతని తండ్రి మృతి చెందడంతో తీవ్ర విషాదంలోకి వెళ్ళాడు. డైరెక్టర్ బాబీ కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.


Click it and Unblock the Notifications











