AP Elections ఎవరో బటన్ నొక్కాల్సిన ఖర్మ మనకెందుకు? వైఎస్ జగన్‌పై హరీష్ శంకర్ సెటైర్
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిది. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఐదు నిమిషాలు కేటాయించడానికి జనానికి ఎందుకో బద్ధకం. భావితరాల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని ఎన్నికల సంఘం, సెలబ్రెటీలు ఎంతగా ప్రచారం చేసినా ఓట్ల పండుగ నాడు పోలింగ్ అంతంత మాత్రమే. ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటిస్తే.. వెకేషన్‌కి ఎక్కడికి వెళ్దామా అని ఆలోచించే వారు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నారు.
ప్రత్యేకించి నగరాలు, పట్టణాల్లో వుండేవారు.. బాగా చదువుకుని నలుగురికి చెప్పాల్సిన స్థితిలో ఉన్నవారిలో ఈ ధోరణి కనిపిస్తోంది. మనం ఓటేయ్యకపోతే.. ఎవరో ఒకరు వేస్తారు, వాళ్లు గెలుస్తారు కదా అని కొందరంటే.. రాజకీయాలు బాలేదని, నిజాయితీగా ప్రజలకు సేవ చేసే నాయకులు లేరని అందుకే తాము ఓటేయ్యడం లేదని ఇంకొందరు వాదిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని ఎవరూ బాగు చేయలేరు.

ఇదిలావుండగా .. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పోలింగ్ డే. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పలువురు ప్రముఖులు కూడా సామాన్యుల్లాగా క్యూలో నిలబడి ఓటు వేస్తున్నారు.
ఈ సందర్భంగా టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఓటు హక్కు, దాని విలువపై తనదైనశైలిలో తెలియజేశారు. '' రాజకీయాల్లోకి వచ్చి సంపాదించిన నాయకులు కాదు .. సంపాదించింది రాజకీయాల్లోకి వచ్చి .. ప్రజల కోసం ఖర్చుపెట్టిన .. నాయకున్ని గుర్తించండి .. ఎవరో బటన్ నొక్కితే బతికే కర్మ మనకు లేదు .. మన బటన్ మనమే నొక్కాలి .. అదే .. ఈరోజు ఈవీఎం బటన్ అవ్వాలి .. ఓటు మన హక్కు మాత్రమే కాదు .. మన బాధ్యత కూడా '' అంటూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్‌ను పరోక్షంగా పవన్ కళ్యాణ్‌ను సపోర్ట్ చేసేలా కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. '' సంపాదించింది రాజకీయాల్లోకి వచ్చి ఖర్చు పెట్టిన '' అనే మాట పవన్‌ను ఉద్దేశించే హరీష్ శంకర్ వ్యాఖ్యానించారని అంటున్నారు. ఇక బటన్ నొక్కుడు అనే మాటను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించే ప్రస్తావించారని సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ నడుస్తోంది.
పవన్ కళ్యాణ్‌కు హరీష్ డై హార్ట్ ఫ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. వేదికపై మైక్ అందుకుంటే పవన్ నామస్మరణలో తరించిపోతారు హరీష్. తన అభిమాన హీరోతో గబ్బర్ సింగ్ సినిమా తీసిన ఆయన పవన్ కళ్యాణ్‌ను ఫ్యాన్స్ ఎలా చూసేందుకు ఇష్టపడతారో అలా చూపించాడు. అప్పటి వరకు వరుస ఫ్లాపులతో ఉన్న పవన్ కళ్యాణ్‌కు బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చారు హరీష్.
దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్‌తో జతకట్టాడు హరీష్ . అదే ''ఉస్తాద్ భగత్ సింగ్ ''. ఆల్రెడీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లగా.. గతేదాడి పవన్ బర్త్ డే సందర్భంగా ఖాకీ చొక్కా, గళ్ల లుంగీ ధరించిన పవర్‌స్టార్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, వై రవిశంకర్‌లు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. అశుతోష్ రాణా, గౌతమీలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











