కల్కిలో ప్రభాస్ జోకర్‌లా..బాలీవుడ్ నటుడు కామెంట్..టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఫైర్
బాహుబలితో మొదలైన పాన్ ఇండియా కల్చర్ దాటికి బాలీవుడ్ కూసాలు కదిలిపోతున్నాయి. మన జక్కన్న వేసిన బాటలో పలు దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా ఫార్మాట్‌లో హిందీ పరిశ్రమపై దండెత్తాయి. మన సినిమాలకు కనక వర్షం కురుస్తుండగా.. బాలీవుడ్ స్టార్ల చిత్రాలు వెలవెలబోయాయి. ఒకానొక దశలో కనీసం థియేటర్ మెయింటైనింగ్‌కి అయినా డబ్బులు వస్తాయా , రావా అన్న సందేహం నెలకొందంటే అతిశయోక్తి కాదు.
మాస్ మసాలా, యాక్షన్ ఎలిమెంట్స్‌తో వచ్చే మన సినిమాలను హిందీ జనాలు ఆదరిస్తున్నారు. ఈ దెబ్బతో ఏ కంటెంట్ సినిమా తీయాలా అని బాలీవుడ్ మేకర్స్ తలపట్టుకున్నారు. ఇప్పుడు ఇండియన్ మూవీ అంటే టాలీవుడ్ అన్నంతగా తెలుగు సినిమా తన ముద్ర వేసింది. ఇక ఆర్ఆర్ఆర్ ఏకంగా ఆస్కార్ అవార్డ్‌ని కొల్లగొట్టడంతో హిందీ జనాలు కడుపుమంటతో రగిలిపోయారు. దీంతో ఆ పురస్కారాన్ని డబ్బులిచ్చి కొన్నారని, వేరే మార్గాల్లో లాబీయింగ్ ద్వారా సంపాదించారని కొందరు నోటికొచ్చినట్లుగా మాట్లాడారు.

తమ పరిస్ధితి ఇలా దిగజారడానికి టాలీవుడ్డేననే అక్కసు బాలీవుడ్ జనాల్లో నెలకొంది. వీలు చిక్కినప్పుడల్లా తెలుగు చిత్ర పరిశ్రమను, ఇక్కడి నటీనటులను వారు తక్కువగా మాట్లాడుతూనే ఉన్నారు. మొన్నామధ్య అంబానీల పెళ్లిలో రామ్ చరణ్‌ను ఇడ్లీ, సాంబార్ అంటూ పిలవడం దుమారం రేపింది. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ విజయవంతంగా 50 రోజులు ప్రదర్శితమైంది. మహాభారతానికి సైన్స్ ఫిక్షన్‌ని జోడించి వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
భారతీయులు సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, సూపర్ హీరోస్ వంటి సబ్జెక్ట్స్‌ని సరిగా డీల్ చేయలేరంటూ ఫారిన్ మేకర్స్ చేసిన మాటలకు తెలుగు సినిమా సమాధానం చెప్పింది. ఇక్కడా టాలీవుడ్‌కు మార్కులు పడటాన్ని హిందీ జనాలు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్‌పై తన అక్కసు చూపించాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ. కల్కి తనకు నచ్చలేదని.. అమితాబ్ క్యారెక్టర్‌తో పోలిస్తే ప్రభాస్ పాత్ర తేలిపోయిందన్నాడు. ప్రభాస్ లుక్ జోకర్‌లా ఉందని.. మ్యాడ్ మ్యాక్స్‌లో మెల్ గిబ్సన్‌లా నిన్ను చూడాలనుకున్నానని వార్సీ వ్యాఖ్యానించారు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వార్సీని ఓ ఆట ఆడుకుంటున్నారు. తాజాగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్పందించారు. ప్రేక్షకులు డార్లింగ్ అని పిలిచే నటుడిని జోకర్ అనే ముద్ర వేశారని.. బాహుబలి సిరీస్‌తో ప్రపంచ వేదికపై ప్రభాస్ భారతీయ సినిమాను నిలబెట్టారని అభిషేక్ ప్రశంసించారు. ఇలాంటి వెక్కిరింపులు వదిలి.. కల్కి యూనిట్‌కి మద్ధతుగా నిలవాలని .. తమకు సర్క్యూట్ (మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లో వార్సీ పాత్ర) లాంటి వారు కావాలి కానీ, షార్ట్ సర్క్యూట్‌లు కాదు అని అభిషేక్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు.


Click it and Unblock the Notifications











