ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో దిల్‌రాజు భేటీ , టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?
పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఓ వివాహిత మరణించగా, ఆమె కుమారుడు చావు బతుకుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఎప్పుడెం జరుగుతుందోనని టాలీవుడ్ బిక్కుబిక్కుమంటోంది.
సంధ్య థియేటర్ దుర్ఘటన తర్వాత అల్లు అర్జున్ ఇంట్లో బల ప్రదర్శన, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, తిరిగి ముఖ్యమంత్రికి బన్నీ కౌంటర్, పోలీస్ అధికారులు రంగంలోకి దిగి వీడియోలు రిలీజ్ చేయడం వంటి ఘటనలు దుమారం రేపాయి. ఇదే సమయంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతులు ఉండవని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.

సంక్రాంతికి బడా సినిమాలు రిలీజ్ కానున్న దశలో రేవంత్ రెడ్డి ప్రకటన టాలీవుడ్ వర్గాలకి షాకిచ్చింది. దీంతో సీఎం ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగారు. ప్రధానంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా ఉన్న నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య వారధిగా వ్యవహరిస్తున్నారు. ఆయన రంగంలోకి దిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్‌ను పరామర్శించడంతో పాటు బాధిత కుటుంబానికి రూ.2 కోట్ల సాయం అందజేశారు. ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీని ఏర్పాటు చేశారు.
దాదాపు 50 మంది సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి సమావేశమవ్వగా మరోసారి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదని.. అభిమానులను సెలబ్రిటీలే కంట్రోల్ చేసుకోవాలని, బౌన్సర్ల విషయంలో సీరియస్‌గా ఉంటామని సీఎం తేల్చిచెప్పారు. అలాగే ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అయితే సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో మెజారిటీ షేర్ దిల్ రాజుదే కావడంతో ఆయన పరిస్ధితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణలో తొక్కిసలాట నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలపై అక్కడి ప్రభుత్వం కఠినంగా ఉండటంతో ఏపీ ప్రభుత్వం ఎలా ఉండబోతోందని చర్చ మొదలైంది. ఏమాత్రం తేడా వచ్చినా ప్రతిపక్షం విరుచుకుపడుతుందని కూటమి ప్రభుత్వం కూడా భావిస్తోంది. అలాంటి చర్యలు తీసుకోవడానికంటే ముందే ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో దిల్‌రాజు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, సినీనటుడు పవన్ కళ్యాణ్‌తో దిల్‌రాజు భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్, బెనిఫిట్ షోల రద్దుపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాల్సిందిగా ఆహ్వానించేందుకే దిల్‌రాజ్ మంగళగిరికి వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











