నా టార్గెట్ 25 మంది అమ్మాయిలు .. టాలీవుడ్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్
అందం , అభినయం ఉన్నప్పటికీ తెలుగు అమ్మాయిలకి తెలుగు సినిమాలలో అవకాశాలు అందడం లేదంటూ పలువురు ముద్దుగుమ్మలు బహిరంగంగానే వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. సొంత ఇండస్ట్రీ నుంచి ప్రోత్సాహం లభించకపోవడంతో తాము పక్కచూపులు చూడాల్సి వస్తోందని కొందరు హీరోయిన్లు వాపోతున్నారు. అంజలి, ఐశ్వర్య రాజేష్, శ్రీదివ్య, ఆనంది వంటి ప్రతిభావంతులకు తెలుగునాట సరైన అవకాశాలు లేకపోవడంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ స్థార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్నారు.
అలాంటిది తెలుగు హీరోయిన్ల గురించి నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడు (ఎస్కేఎన్ ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రిటర్న్ ఆఫ్ డ్రాగన్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఎస్కేఎన్ మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయనని, అలా చేస్తే ఏం జరుగుతుందో తనకి తెలిసొచ్చిందంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇదొక్కటే కాకుండా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ వేదికపై ఎస్‌కేఎన్ చేసిన మరిన్ని వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ కాయదు లోహర్ మీద డబుల్ మీనింగ్‌లో మాట్లాడాడు.

హీరోయిన్ కాయల్.. కాయలా? పళ్లా .. తెలుగులో కాయలు, పళ్లు అంటే వేరే అర్ధాలు ఉంటాయంటూ ఎస్‌కేఎన్ వ్యాఖ్యానించారు. తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగురాని అమ్మాయిల్నే మేం ఎక్కువగా ప్రేమిస్తుంటాం అని ఆయన చెప్పాడు. ఇకపై తెలుగు రాని అమ్మాయిల్నే ఎంకరేజ్ చేయాలని నేనూ, సాయి రాజేష్ కోరుకుంటున్నామని ఎస్‌కేఎన్ వ్యాఖ్యానించారు. అయితే ఎస్కేఎన్ ఎవరి గురించి ఈ వ్యాఖ్యలు చేశారో కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది.
హీరోయిన్ రేఖా భోజ్ అయితే ఈ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ఇది తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలపై అనధికార నిషేధమేనంటూ మండిపడింది. మా బ్రతుకు మీద కొట్టేలా మాట్లాడిన తర్వాత మీకు గౌరవం ఇచ్చేది లేదంటూ రేఖా భోజ్ వ్యాఖ్యానించింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఎస్కేఎన్ స్పందించారు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ వేదిక మీద నేను చేసిన కామెంట్స్‌ను కేవలం జోక్‌గానే తీసుకోవాలని అన్నారు.

తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహించే అతికొద్ది మంది నిర్మాతలలో తాను కూడా ఒకడిని అని .. ఇప్పటి వరకు రేష్మ, ఆనంది, మానస, ప్రియాంక జువాల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, ఖుషిత వంటి దాదాపు 10 నుంచి 12 మంది తెలుగు హీరోయిన్స్ నా బ్యానర్ నుంచి పరిచయమయ్యారని ఎస్‌కేఎన్ చెప్పారు. దాదాపు 25 మంది తెలుగు అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్నది తన టార్గెట్ అని.. అందులో హీరోయిన్లు, రచయితలు, ఆర్ట్ డైరెక్టర్‌లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, దర్శకులు ఇలా 24 క్రాఫ్ట్స్‌కి చెందిన వారు ఉంటారని ఎస్‌కేఎన్ పేర్కొన్నారు. తన తదుపరి మూడు సినిమాల్లో తెలుగు అమ్మాయిలే ఉన్నారని.. సరదాగా చేసిన వ్యాఖ్యలను స్టేట్‌మెంట్స్‌గా మార్చొద్దని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. మరి ఈ వివాదానికి ఇకనైనా ఫుల్ స్టాప్ పడుతుందో ? లేదో ? చూడాలి.


Click it and Unblock the Notifications











