'నా భార్యతో అలా బ్రేకప్.. కానీ ఆమె రెండో భర్తతో '
భార్యాభర్తలిద్దరూ కలిసి సాగితేనే అది అందమైన కాపురం. లేదంటే ప్రతినిత్యం కలహాలే. ఒకరిపై ఒకరు నమ్మకంతో అర్ధం చేసుకుంటూ తమ జీవితాన్ని ఆనందమయం చేసుకునే జంటలు కొందరే. ఇటీవల కాలంలో విడాకుల కల్చర్ ఎక్కువై.. దేశానికి ఓ సామాజిక సమస్యలా మారుతోంది. ఒకరి ఇష్టాలను, అభిప్రాయాలను మరొకరు గౌరవించకపోవడంతోనే మనస్పర్ధలు, గొడవలు, పంచాయతీలు చివరికి విడాకులు అన్నట్లుగా పరిస్ధితి తయారైంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల ప్రయాణంపై సీనియర్ నటుడు సురేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
మైసూరు శేషయ్య సురేష్ బాబు నాయుడు అంటే ఎవరికీ గుర్తురాకపోవచ్చు. అదే సీనియర్ హీరో సురేష్ అంటే ఠక్కున గుర్తొస్తాడు. హీరోగా, విలన్‌గా, నిర్మాతగా ఒకప్పుడు దక్షిణాదిన ఫుల్ డిమాండ్ ఉన్న సురేష్ తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాడు. నాగార్జున, అరవింద్ స్వామి, అజిత్ వంటి స్టార్ హీరోలకు డబ్బింగ్ చెప్పిన ఘనత కూడా సురేష్ సొంతం. 26 ఆగస్ట్ 1963న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జన్మించిన సురేష్ 1981లో పన్నీర్ పుష్పాంగల్ అనిల్ తమిళ చిత్రం ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. రామదండుతో తెలుగువారిని పలకరించారు. 4 దశాబ్ధాల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ , మలయాళ, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించిన సురేష్ తన విలక్షణమైన వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటున్నారు.

కెరీర్ బిగినింగ్ రోజుల్లోనే సురేష్ .. సినీ నటి అనితా రెడ్డిని పెళ్లాడారు. బాబాయ్ అబ్బాయ్, శ్రీవారి శోభనం తదితర చిత్రాల్లో ఆమె హీరోయిన్‌గా నటించారు. అయితే కొన్నేళ్లకే ఈ జంట విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే భార్యపై ప్రేమతో సురేష్ విడిపోవడానికి ఒప్పుకున్నారట. ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, పెళ్లి, విడాకులు తదితర అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సురేష్.
విడిపోవడానికి మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని.. కానీ తనకు బాగా చదువుకోవాలని కోరికగా ఉండేదని, దీంతో నటించడం కూడా మానేసిందని సురేష్ తెలిపారు. అమెరికాలో సెటిలవ్వాలని అనితా కోరుకుందని.. కానీ తాను సినిమాల్లో బాగా బిజీగా ఉండటంతో ఆమె ఇష్టాన్ని గౌరవించి విడిపోయామని ఆయన చెప్పారు. కోరుకున్న ప్రకారం అనిత అమెరికా వెళ్లిపోయి చదువుకుని , రెండో పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైందని సురేష్ తెలిపారు.

తాను కూడా దర్శక రచయిత్రీ రాశిని పెళ్లి చేసుకున్నానని ఆయన చెప్పారు. తొలుత నాతో పెళ్లయ్యాక అనిత తన పేరును అనితా సురేష్ అని మార్చుకుందని, విడాకులై మరొకరిని పెళ్లి చేసుకున్నాక కూడా అదే పేరు కొనసాగిస్తోందని సురేష్ వెల్లడించారు. తాను అమెరికా వెళ్తే అనిత ఇంట్లోనే ఉంటానని, భార్యాభర్తలిద్దరూ నన్ను బాగా చూసుకుంటారని తన మొదటి భార్య గురించి గొప్పగా చెప్పారు సురేష్.
మా దృక్పథాలు మారినప్పుడు ఇద్దరం కూర్చొని నాతో ఉంటావా? వేరే చోటికి వెళ్లిపోతావా అని అడిగానని నాకు మరోచోటే బాగుంటుందని అనిత చెప్పినప్పుడు వాళ్ల ఫ్రీడం వాళ్లకి ఇచ్చేయాలని తెలిపారు. మీరు కావాలన్న వాళ్లతోనే మీరు ఉన్నప్పుడు అన్ని బాగుంటాయని యువతకు సురేష్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సురేష్ పెద్ద మనసుని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











