C Krishnaveni Death : విషాదం.. అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు.!
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. అలనాటి నటి సీ కృష్ణవేణి కొద్దిసేపటి కింద తుదిశ్వాసను విడాచారు. 101 ఏళ్ల వయస్సులో సీనియర్ నటి కృష్ణవేణి కన్నుమూశారు. ఈరోజు ఉదయం కన్నుమూశారు. వయస్సుపైబడి కాలం చెల్లారు. ఆమె మరణవార్త విన్న సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, నటిగా, నిర్మాతగా, శోఛనచాల స్టూడియో అధినేతగా తెలుగు సినీ చరిత్రలో ఆమెది ఓ ప్రత్యేక అధ్యాయనమంటూ కొనియాడుతున్నారు.
'మన దేశం' లాంటి గొప్ప చిత్రాలు నిర్మించి సమాజంలో ఉన్నత విలువలను పెంచడానికి సీ కృష్ణవేణి ఎంతగానో కృషి చేశారు. ప్రభుత్వ పరంగా ఎన్నో అవార్డ్స్ ను అందుకొన్నారు. కృష్ణవేణి చివరిగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో కనిపించారు. ఇక కొన్నాళ్లుగా ఆరోగ్యం సహకరించక ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుండగా.. ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్త తెలుసుకున్నాక సినీ లోకం విచారం వ్యక్తం చేస్తోంది. ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ఆమె మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికన నివాళి అర్పించారు. ఆమె ఘనతను నేటి తరానికి గుర్తు చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. సీ కృష్ణవేణి మరణవార్త పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కూడా కోరుకున్నారు.

ఇక... అలనాటి నటి సీ కృష్ణవేణి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అభిమానుల కోసం.. ఆమె సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసారు. 1936లో 'సతీఅనసూయ' /ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేసారు. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో దాదాపు 15 చిత్రాలలో నటించారు. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించారు. సీ కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత మీర్జాపురం రాజా మేకా రంగయ్యను వివాహం చేసుకుంది.
ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును, నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేసారు. ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను పరిచయం చేసారు.
1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసారు తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషిగాను 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకుంది. కృష్ణవేణి నిర్వహించిన నిర్మాణ సంస్థలు... భర్త ద్వారా స్థాపించిన సంస్థ - జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు. ఆమె స్వయంగా తన కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎంఆర్ఏ ప్రొడక్షన్స్ ను స్థాపించారు. సొంత బ్యానర్ లో మన దేశం (1949), లక్ష్మమ్మ (1950), దాంపత్యం (1957), గొల్లభామ (1947), భక్త ప్రహ్లాద (1942) వంటి చిత్రాలను నిర్మించారు.


Click it and Unblock the Notifications











